- ఇటీవల దొరికిన కళేబరాలు చిరుతలవేనని నిర్ధారణ
- నెల కింద భీం గల్ లో, ఐదు నెలల కింద ఇందల్వాయిలో చంపినట్లు గుర్తింపు
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ ఫారెస్ట్ ఏరియాలో దొరికిన రెండు కళేబరాలు పులులవి కాదని, చిరుతలవేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ చిరుత పులులను చంపిన వ్యక్తులను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సాయిచైతన్య, ఇన్ చార్జి డీఎఫ్ వో సుశాంక్ సుఖ్ దేవ్ గురవారం స్థానికంగా వెల్లడించారు.
భీంగల్మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలావత్సంజీవ్ మేకల కాపరిగా పనిచేస్తున్నాడు. నెల క్రితం మందను కారేపల్లి అడవిలోకి తీసుకెళ్లగా.. ఓ చిరుత మేకపై దాడిచేసి చంపేసింది. భయంతో గ్రామంలోకి పరుగెత్తిన సంజీవ్ విషయాన్ని స్థానికులకు చెప్పాడు. చిరుత శరీర భాగాలు అమ్మితే రూ. లక్షలు వస్తాయని, చనిపోయిన మేక బాడీలోకి గడ్డి మందు ఎక్కించి దానిని తినడానికి వచ్చిన చిరుతను చంపొచ్చని సిరిసిల్ల రాములు అనే వ్యక్తి చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి మళ్లీ అడవిలోకి వెళ్లి చనిపోయిన మేక శరీరంలోకి గడ్డి మందు ఎక్కించి తిరిగొచ్చారు. తెల్లారి వెళ్లే సరికి చిరుత చనిపోయి కనిపించింది.
దీంతో కొనుగోలుదారుడి కోసం వెతుకుతూ చిరుతను భూమిలో పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న కమ్మర్పల్లి ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ అనిత నిందితులను అదుపులోకి తీసుకొని పులి కళేబరాన్ని బయటకు తీయించారు. నిందితులిద్దరినీ అరెస్ట్‌చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఐదు నెలల కింద నలుగురు వ్యక్తులు కలిసి మరో చిరుతను చంపినట్లు వెల్లడించారు.
అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో పడ్డ చిరుతను నిందితులు కర్రలతో కొట్టి హతమార్చిన అనంతరం ధర్పల్లి గ్రామ శివారులోని మామిడి తోటకు తరలించి పంజాలను వేరు చేశారు. చర్మాన్ని ఒలిచేసి మిగిలిన శరీర భాగాన్ని దగ్గర్లోని బావిలో వేసి వెళ్లిపోయారు.
కుళ్లిన స్థితిలో చిరుత కళేబరాన్ని కనుగొన్న ఫారెస్ట్ ఆఫీసర్లు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి పులి చర్మం, గోళ్లు, వేటకు ఉపయోగించే ఉచ్చులు, వేట సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అడిషనల్ డీసీపీ శుభం ప్రకాశ్, ఎఫ్డీవో చంద్రశేఖర్ ఉన్నారు.
తొమ్మిది నాటు తుపాకులు స్వాధీనం
వన్యప్రాణుల వేటకు ఉపయోగిస్తున్న తొమ్మిది నాటు తుపాకులు స్వాధీనం చేసుకొని పది మందిని అరెస్ట్‌చేసినట్లు సీపీ సాయిచైతన్య వెల్లడించారు. రెండు చిరుతల కళేబరాలు బయటపడ్డ విషయంపై దర్యప్తు చేపట్టగా లైసెన్స్ లు లేని నాటు తుపాకుల విషయం వెలుగు చూసిందన్నారు. భీంగల్ మండలం దేవక్కపల్లి ఫారెస్ట్‌లో దాచేందుకు నాటుతుపాకులు తీసుకెళ్తుండగా సీసీఎస్టీంకు చిక్కినట్లు తెలిపారు.
లైసెన్స్‌లేకుండా నాటు తుపాకులు వాడుతున్న భుక్యా రఘుపతి, కార్ల అంజయ్య, ముదావత్ తిరుపతి, భూక్యా చందర్, ముర్రి గంగ నర్సయ్య, అనిమేని లింబాద్రి, మాలావత్కుంభ, బనావత్గంగా, మాలావత్ ధారిసింగ్ తోపాటు తుపాకులను రిపేర్ చేసే అకునూర్ రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ముఠాను పట్టుకున్న సీసీఎస్ఏసీపీ శ్రీశైలం, ఆర్మూర్ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు సురేశ్, సత్యనారాయణ గౌడ్, తిరుపతిని సీపీ సాయిచైతన్య అభినందించారు.
