- భద్రాద్రి జిల్లాలో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి
- పాల్వంచలో మరో ప్రమాదం.. ఒకరు మృతి
- జగిత్యాల జిల్లాలో బైక్ ను ఢీకొట్టిన ట్యాంకర్ .. ఒకరు మృతి
పాల్వంచ, వెలుగు : హైవే పై యూటర్న్ తీసుకుంటున్న బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు రైతులు చనిపోయారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన తేజావత్ దూధ్యా (45), ఈసం జనార్దన్ (45) కలిసి డ్రిప్ పైప్ లు కొనేందుకు బైక్ పై పాల్వంచకు వచ్చారు. పని ముగించుకున్న అనంతరం తిరిగి ఇంటికి వెళ్తూ... స్థానిక నవభారత్ వద్ద యూ టర్న్ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొత్తగూ డెం వైపు నుంచి వచ్చిన భద్రాచలం డిపో బస్సు బైక్ ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట నాగరాజు తెలిపారు.
రెండ్ బైక్ లు ఢీకొని యువకుడు..
రెండు బైక్ లు ఢీకొనడంతో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ప్రమాదం భద్రాద్రి జిల్లా పాల్వంచలో జరిగింది. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన తోట అరవింద్ కుమార్ (28) తోగ్గూడెం మిషన్ భగీరథ ప్లాంట్ లో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి బైక్ పై పాల్వంచ వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. స్థానిక ఇందిరా కాలనీ వద్దకు రాగానే మరో బైక్ ఢీకొట్టడంతో కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో పాల్వంచ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
ట్యాంకర్ ఢీకొని బాలుడు...
కోరుట్ల, వెలుగు : బైక్ ను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ బాలుడు చనిపోగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గురువారం జరిగింది. పట్టణంలోని బాలాజీ రోడ్డుకు చెందిన మగ్గిడి రవీందర్-- సుమ దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడైన జశ్వంత్ (13) గురువారం ఉదయం తన అన్న చాణక్యతో కలిసి బైక్ పై కోరుట్ల కొత్త బస్టాండ్ కు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా.. వేములవాడ రోడ్డులో డీజిల్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో జశ్వంత్ అక్కడికక్కడే చనిపోగా, చాణక్యకు తీవ్ర గాయాలయ్యాయి. చాణక్య ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. మృతుడి తండ్రి రవీందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
