బెంగాల్‎లో ఘోర ప్రమాదం: స్కూల్ వ్యాన్‎ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు స్పాట్ డెడ్

బెంగాల్‎లో ఘోర ప్రమాదం: స్కూల్ వ్యాన్‎ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు స్పాట్ డెడ్

కోల్‎కతా: వెస్ట్ బెంగాల్‎లో ఘోర ప్రమాదం జరిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో స్కూల్ పిల్లల వ్యాన్‎ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కర్ణ సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేటు దగ్గర శుక్రవారం (జులై 17) ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 

గోవిందాపూర్ రైల్వే గేట్ దగ్గర పాఠశాల విద్యార్థులతో వెళుతున్న వాహనం పట్టాలు దాటుతోన్న క్రమంలో లోకల్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స కోసంబెర్హంపూర్ ఆసుపత్రిలో చేర్చారు. 

ప్రమాదానికి గల కారణాలను విచారించేందుకు 10 మంది సభ్యుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ప్రమాద సమయంలో రైల్వే క్రాసింగ్ గేట్ తెరిచి ఉంచడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదం కారణంగా తూర్పు రైల్వే హౌరా డివిజన్‌లోని అజీమ్‌గంజ్-కట్వా సెక్షన్‌లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు.