తెలంగాణవ్యాప్తంగా కల్తీ నెయ్యి విక్రయదారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతూ కల్తీ మూఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని CURE పరిసర ప్రాంతాల్లో పోలీసులతో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
సాధారణంగా స్వచ్ఛమైన నెయ్యిలో 99.5% మిల్క్ ఫ్యాట్ తప్పనిసరిగా ఉండాలి.. అలాగే 0.5% కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. కానీ, లాభాలే పరమావధిగా భావిస్తున్న కొందరు కేటుగాళ్లు.. పామ్ ఆయిల్, వనస్పతి, కొబ్బరి నూనెలను ఇష్టమొచ్చినట్టు కలిపేసి మార్కెట్లోకి వదులుతున్నట్లు అధికారులు గుర్తించారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని మొత్తం 65 సంస్థల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. అక్కడ 91 నెయ్యి నమూనాలను సేకరించిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలకు తక్షణమే నోటీసులు జారీ చేశారు.
ఇక హైదరాబాద్ CURE పరిధిలో 14 చోట్ల ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 15 చోట్ల నెయ్యి శాంపిల్స్ సేకరించడమే కాకుండా.. ఏకంగా 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించేలా ఉన్న 60 కిలోల కలుషిత నెయ్యిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ప్రస్తుతం సేకరించిన నమూనాలన్నింటినీ ల్యాబ్ పరీక్షలకు పంపామని.. ఆ రిపోర్టుల ఆధారంగా నిందితులపై తదుపరి కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ, కల్తీ నెయ్యి విక్రయించడం ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని.. అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
