పాల్వంచ/మణుగూరు/అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ, సమ్మక్క బ్యారేజీల పనుల పరిశీలనకు వచ్చిన మంత్రుల పర్యటనను అడ్డుకోవాలన్న బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో గురువారం పాల్వంచలోని 3 డివిజన్ల కార్పొరేటర్లు సింధు తపస్వి, భత్తుల మధుచంద్, గుగులోతు రాంబాబుతోపాటు లీడర్లు మల్లెల రవిచంద్ర, వీరునాయక్ పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బీఆర్‌ఎస్ లీడర్లు కొందరు పోలీస్ స్టేషన్ ఎదుట నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు.
సీతారామ ప్రాజెక్ట్ కెనాల్‌లో భూములు కోల్పోతున్న అశ్వాపురం మండల రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తమకు అందాల్సిన పరిహారం కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్తున్నామని, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి ఇద్దరిని మాత్రమే అనుమతించడంతో వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. చలో మణుగూరుకు బయలుదేరిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
