బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మెదక్​ టౌన్, వెలుగు :  మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన  స్థానిక టైర్​ పంక్చర్​ దుకాణం యజమాని మహ్మద్ శంషొద్దీన్‌‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్ఎం శుభవల్లి గురువారం తీర్పునిచ్చారని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. 2022 అక్టోబర్ 10న అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను నిందితుడు నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పటి ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేయగా, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి వైద్య పరీక్షలు, శాస్త్రీయ ఆధారాలు సేకరించి కోర్టులో పకడ్బందీగా చార్జ్‌‌షీట్ దాఖలు చేశారు. భరోసా కేంద్రం లీగల్ అడ్వైజర్ శ్వేత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య సమర్థవంతంగా వాదనలు వినిపించగా, నేరం నిరూపితం కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు
 తీర్పునిచ్చారు. 

మరోఘటనలో...

సిద్దిపేట రూరల్ : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన తాడేం చందు (34) అనే నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. 2022 మే 20న నమోదైన ఈ పోక్సో కేసులో అప్పటి దర్యాప్తు అధికారి, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి సమగ్ర దర్యాప్తు చేపట్టి, పటిష్టమైన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను సేకరించి న్యాయస్థానంలో చార్జ్‌‌షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన కోర్టు న్యాయమూర్తి వై. జయప్రసాద్ అన్ని ఆధారాలను పరిశీలించి, నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ ఈమేరకు శిక్ష ఖరారు చేశారు.