ధర్మసాగర్, వెలుగు: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.92లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండేళ్లలోనే రూ.35వేల కోట్లతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఈ రెండున్నర ఏళ్లలో రూ.2కోట్ల అభివృద్ధి పనులు చేశానన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భావ్‌సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెసరు రమేశ్, సర్పంచ్ మాచర్ల జ్యోతి, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
