తేనెటీగల పెంపకంతో మహిళా సంఘాలు బలోపేతం.. మేడారం.. హేమాచల దేవాలయాలు అభివృద్ది

తేనెటీగల పెంపకంతో మహిళా సంఘాలు బలోపేతం.. మేడారం.. హేమాచల దేవాలయాలు అభివృద్ది
  • మేడారం రహదారులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి : మంత్రి సీతక్క
  • మూడు కోట్ల రూపాయలతో హేమాచల క్షేత్రం అభివృద్ధి

ఏటూరునాగారం/తాడ్వాయి/మంగపేట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గురువారం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మేడారం వనదేవతలను, మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు. స్థానిక హరిత హోటల్ లో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మేడారం, -తాడ్వాయి, పస్రా, -మేడారం, చిన్నబోయినపల్లి, -కొండాయి- ఊరటం రహదారుల విస్తరణకు అంచనాలు సిద్ధం చేయాలని, అవసరమైన అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద సౌలత్ లు కల్పిస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రూ. 3 కోట్లతో హేమచల ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ఆలయం వద్ద చేపట్టే అభివృద్ధి పనులను 2027 జూన్ లో జరిగి గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 

 తాడ్వాయి మండలంలోని గోనెపల్లిలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హంబుల్, బీ సంస్థ ఆధ్వర్యంలో సమ్మక్క- సారక్క మండల సమైక్య పరిధిలోని వెలుగు రేఖ గ్రామ సంఘం మహిళలకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

తేనె టీగల పెంపకంతో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. మంత్రి వెంట కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పో, ఎఫ్‌‌వో వికాస్ మీనా, అడిషనల్ కలెక్టర్లు సీహెచ్. మహేందర్, సంపత్‌‌రావు ఉన్నారు.