రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన సుధాకర్, బతుకుదెరువు కోసం 12 ఏళ్ల క్రితం శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి వలస వచ్చారు. అక్కడ ఓ వ్యవసాయ పొలంలో పని చేసుకుంటూ తన భార్య వసంత, కూతురు నవ్య, కొడుకు వరుణ్‌తో కలిసి జీవనం సాగిస్తున్నారు.
అయితే, నిన్న రాత్రి భర్త సుధాకర్, భార్య వసంతల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత.. క్షణికావేశంలో అర్ధరాత్రి వేళ తన పిల్లలు నవ్య, వరుణ్‌లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి పిల్లలిద్దరితో సహా దూకేసింది.
ఈ ప్రమాదంలో తల్లి వసంత, 15 ఏళ్ల కూతురు నవ్య నీట మునిగి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే, 10 ఏళ్ల కొడుకు వరుణ్ మాత్రం అదృష్టవశాత్తూ బావిలో ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబంలో ఈ ఘోర విషాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
