కాకినాడ దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ : ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

కాకినాడ దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ : ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని దగ్గర పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్ రైలు.. తుని దగ్గర లూప్ లైన్ లోకి వెళుతున్న సమయంలో పట్టాలు తప్పింది. 2026, జూలై 17వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 

రైల్వే వంతెన దాటిన తర్వాత గూడ్స్ రైలును లూప్ లైన్ లోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే నెమ్మదిగా వస్తున్న రైలు.. పట్టాలు తప్పటంతో ఓ బోగీ పక్కకు పడింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే.. డ్రైవర్ రైలును నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

రైల్వే అధికారులు వెంటనే స్పందించి.. పట్టాలు తప్పిన బోగీలను తొలగించారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. లూప్ లైన్ లో గూడ్స్ రైలు అలాగే ఉండటంతో.. ఆ రూట్ లో వచ్చే మిగతా అన్ని రైళ్లను మెయిన్ లైన్ లోకి మళ్లించటంతో.. రైళ్ల రాకపోకలు ఆలస్యంగా ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత యథావిథిగా రైళ్లు నడుస్తాయని.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించారు రైల్వే అధికారులు.