పీపీపీ విదానంతోనే వేగంగా అభివృద్ధి సాధించవచ్చని అన్నారు సీఎం చంద్రబాబు. గురువారం పీపీపీ ప్రాజెక్టులు, పీపీపీ విధానంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని అన్నారు. ప్రభుత్వం దగ్గర నిరర్ధకంగా ఉన్న ఆస్తులనుసద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని... ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టి వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు సీఎం చంద్రబాబు.
ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్టు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు చంద్రబాబుకు వివరించారు. అన్ని పీపీపీ ప్రాజెక్టులనూ సస్టెయినబుల్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని... ప్రతీ ప్రాజెక్టు వద్దా ఆర్ధిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా చూడాలని అన్నారు సీఎం చంద్రబాబు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లాంటి వాటిని కూడా సమర్ధంగా వినియోగించుకోవాలని అన్నారు.
రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల దగ్గర పబ్లిక్ టచ్ పాయింట్ల దగ్గర మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆర్ధిక కార్యకలాపాలకు అవకాశాలు కల్పించాలని అన్నారు.
ప్రభుత్వ ఆస్తుల సద్వినియోగం
ప్రభుత్వం దగ్గర నిరర్ధకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్య పరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని... పంప్డ్ స్టోరేజీ, సౌరవిద్యుత్ ప్రాజెక్టులు కూడా పీపీపీ కింద చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. గనులు, నెడ్ క్యాప్, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని అన్నారు సీఎం చంద్రబాబు.
►ALSO READ | టీటీడీ జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు.. పూర్తి వివరాలు ఇవే !
రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉన్న విద్యార్ధుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని.. పట్టణ ప్రాంతాల్లో రహదారులకు సమీపంలోనే మినీ టౌన్‌షిప్‌లా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులను నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ చదివేలా పేద విద్యార్థులను తీర్చి దిద్దాలని అన్నారు.
