చెన్నై: తమిళనాడులో విజయ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కలర్ పాపడ్లు.. అదేనండీ రంగురంగుల అప్పడాలను బ్యాన్ చేసింది. వినియోగదారులకు ఆకర్షిణీయంగా కనిపించాలని పరిమితికి మించి రంగులు కలిపి అమ్ముతున్నారని, వీటిని తిన్న వాళ్లు.. వాళ్లకు తెలియకుండానే ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని, అధిక మోతాదులో కృత్రిమ రంగులు కలిపిన రంగుల పాపడ్‌ల అమ్మకాలపై తమిళనాడు ఆహార భద్రతా శాఖ నిషేధం విధించింది.
తమిళనాడు ఆహారపు అలవాట్లలో అప్పడాలకు ప్రత్యేక స్థానం ఉంది. తమిళనాడులోని ఇళ్లలో, రెస్టారెంట్లలో భోజనంతో పాటు వీటిని కచ్చితంగా తింటారు. ఈ మధ్య రకరకాల ఆకారాల్లో, రంగుల్లో పాపడ్లను తయారు చేసి అమ్ముతున్నారు. అయితే.. ఈ ఉత్పత్తులలో కొన్నింటిలో పరిధికి మించి కృత్రిమ రంగులు ఉన్నాయని, ఇవి వినియోగదారులకు ఆరోగ్యపరమైన ప్రమాదాలను కలిగించే అవకాశం ఉందని ఆహార భద్రతా అధికారులు హెచ్చరించారు.
►ALSO READ | స్విగ్గీ నుంచి గ్యాస్ సిలిండర్ ఇన్స్టంట్ డెలివరీ.. స్టెప్ బై స్టెప్ బుకింగ్ ప్రాసెస్ !
పాపడ్‌లలో కృత్రిమ రంగులను ఎక్కువగా వాడటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, అలర్జీలు, మూత్రపిండాల సంబంధిత సమస్యలు తలెత్తుతుండటం గమనార్హం. కొన్ని నిషేధిత లేదా అధిక మోతాదులో ఉండే ఆహార రంగులను కలపడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, క్యాన్సర్‌తో సహా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.
ఇలాంటి పాపడ్లను తినే పిల్లల్లో అటెన్షన్ -డెఫిసిట్/హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ADHD)తో సహా ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని FSD హెచ్చరించింది. మినప పప్పు, బియ్యప్పిండితో సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన పాపడ్‌లను మాత్రమే తినాలని తమిళనాడు ఆహార భద్రతా శాఖ (FSD) వినియోగదారులకు సూచించింది.
