Varalaxmi Sarathkumar: 'నేనెప్పుడూ విజయ్‌కు వీరాభిమానినే'.. దళపతిపై వరలక్ష్మి ప్రశంసల వర్షం!

Varalaxmi Sarathkumar: 'నేనెప్పుడూ విజయ్‌కు వీరాభిమానినే'.. దళపతిపై వరలక్ష్మి ప్రశంసల వర్షం!

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్‌ను ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ లేటెస్ట్ గా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దళపతితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ  ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సినీ రంగంలో అగ్రనటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్.. ఇప్పుడు ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలవడం చారిత్రాత్మక ఘట్టమని ఆమె పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వరలక్ష్మి స్పందిస్తూ.. ఈ పోస్ట్ గురించి ఏమి రాయాలా అని చాలా ఆలోచించాను. కానీ ఇప్పటికే చాలా మంది చాలా చెప్పారు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరెన్ని విమర్శలు చేసినా.. సి. జోసెఫ్ విజయ్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి. ఆయన ఇక్కడే ఉండబోతున్నారు అని పేర్కొన్నారు. మొదటి ప్రయత్నంలోనే ప్రజల విశ్వాసాన్ని గెలిచి ముఖ్యమంత్రి కావడం సాధారణ విషయం కాదని, అందుకు అపారమైన ధైర్యం, సంకల్పం, ప్రజల ప్రేమ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. 

విమర్శించడం సులభమే కానీ.. ఒక నాయకుడికి తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, ఆయన పనితీరును చూసి తర్వాతే తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాటల కంటే చేతలే గొప్పవి. కాస్త ఓపిక, గౌరవం, ప్రోత్సాహం ఇస్తే విజయ్ ఏం చేయగలడో కాలమే చూపిస్తుంది అని వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. తాను ఎప్పటినుంచో విజయ్‌కు వీరాభిమానినేనని చెబుతూ.. 'ఐ లవ్ యూ సార్... ఎప్పటికీ నేను విజయ్ వెరియన్‌నే' అంటూ తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. 

►ALSO READ | SamanthaRaj: చిత్తూరులో సమంత సీమంతం వేడుకలు... తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన సామ్!

తమ సమావేశంలో 'సర్కార్' సినిమా షూటింగ్ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని, అప్పుడే విజయ్ రాజకీయాల్లోకి వస్తారని తాను భావించానని చెప్పారు. అంతేకాదు మహిళల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు. తమిళనాడు ప్రజల కోసం విజయ్ నాయకత్వంలో మంచి మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, వరలక్ష్మి శరత్‌కుమార్, విజయ్ కలిసి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' చిత్రంలో నటించారు. ఇందులో వరలక్ష్మి ప్రతినాయకురాలి పాత్రలో ఆకట్టుకున్నారు. మరోవైపు రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయకన్'. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.