అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముద్రగడను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంతకుముందు ముద్రగడ భౌతికకాయానికి వైసీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడె కూడా మోశారు.
అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. కాగా.. ముద్రగడకు నివాళులు అర్పించేందుకు ఆయన కుమార్తె క్రాంతి కిర్లంపూడికిరాగా ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రాంతిని రానివ్వొద్దని ముద్రగడ భార్య సూచించారు. దీంతో పద్మనాభం కుటుంబసభ్యులు, బంధువులు క్రాంతిని రానివ్వలేదు. పోలీసుల సాయంతో వెళ్లేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు.. దీంతో ఆమెను పోలీసులు అక్కడి నుంచి పంపించారు.
పోలీసులను అడ్డుకున్న అంబటి
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలన్న ఆదేశాల మేరకు పోలీసులు గౌరవ వందనం సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఖననం జరుగుతున్న సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపైకి దూసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వద్దని చెబుతున్నా ఎందుకు గౌరవ వందనం చేస్తున్నారంటూ పోలీసులను పక్కకు నెట్టివేశారు.
