- కొత్త మెడికల్ కాలేజీలు, ఎన్ఎంసీ నిబంధనల కోసమే నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న 157 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ కల్పిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2024-–25లో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం, 2025–-26 విద్యా సంవత్సరంలో కొడంగల్ మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం, పాత కాలేజీల్లో యూజీ, పీజీ సీట్లు భారీగా పెరగడంతో ఫ్యాకల్టీ అవసరం ఏర్పడింది.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రూల్స్ ప్రకారం కాలేజీల్లో తగినంత మంది స్టాఫ్ ఉండాలనే ఉద్దేశంతో క్లినికల్, నాన్-క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాలకు చెందిన అర్హులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లందరికీ ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమోషన్ల ప్రక్రియ స్పీడప్చేసేందుకు ప్రభుత్వం ప్యానల్ ఇయర్ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది.
తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ (టీఎస్ అండ్ఎస్ఎస్) రూల్స్ 1996 లోని రూల్ 6 ప్రకారం.. 2026–-27 ప్యానల్ ఇయర్ పరిధిలోకి వచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా ప్రస్తుత 2025-–26 ప్యానల్ ఇయర్‌లోనే ప్రమోషన్లకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కేవలం ఒకే విడత చర్యగా ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేస్తూ, తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ను ఆదేశించింది.
