పద్మారావునగర్, వెలుగు: విద్యా వ్యవస్థను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఏర్పాటు చేసిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తిపైనే శ్రద్ధ పెడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. నీట్పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు, కుటిల రాజకీయాలను ఎండగట్టడంతో పాటు విద్యార్థులకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ పాల్గొన్నారు.
