ఎస్సీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టండి..రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీది అబద్ధాల ప్రచారం: రాంచందర్ రావు

ఎస్సీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టండి..రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీది అబద్ధాల ప్రచారం: రాంచందర్ రావు
  •     దళితుల ఓట్ల కోసం రేవంత్ సర్కారు చీప్ పాలిటిక్స్ 
  •     మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు క్రెడిట్ ప్రధాని మోదీదేనని కామెంట్‌

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలంటే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలే కీలకమని, ఆ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రోగ్రామ్స్ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎస్సీ మోర్చా మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని, పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. రిజర్వేషన్లను సమర్థించి, పరిరక్షించిన హిస్టరీ ఒక్క బీజేపీకే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దళితులను బీజేపీకి దూరం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, ఒక క్యాండిడేట్ మాట్లాడిన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని ఫైర్​అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి, అక్కడ దళితులకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల బెనిఫిట్స్ అందించిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు. దళితులను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటోందని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఆ పార్టీ తీవ్రంగా అవమానించిందని విమర్శించారు. 

దేశంలో అత్యున్నత పదవుల్లో దళిత, గిరిజన వర్గాలకు అవకాశం కల్పించి సామాజిక న్యాయం అంటే ఏంటో బీజేపీ నిరూపించిందన్నారు. తెలంగాణలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచేలా కార్యకర్తలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయాలని సూచించారు. మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద దళిత బస్తీలను తొలగిస్తూ, వారికి పునరావాసం కల్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలను చూశారని, ఇప్పుడు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత సంక్షేమ స్కీమ్స్ ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు క్రెడిట్ మోదీదే..

వరంగల్ మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేయాలని చూడటం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. బుధవారం స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 130 ఏళ్ల కిందటే బ్రిటీష్ కాలంలో ఇక్కడ రన్‌‌‌‌‌‌‌‌వే నిర్మించారని, 2011లో 'రైట్స్' సంస్థ రిపోర్ట్ ఇచ్చినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కంప్లీట్‌‌‌‌‌‌‌‌గా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌లోని క్లాజ్ 5.2 ప్రకారం.. 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు రాకూడదనే నిబంధన పెద్ద అడ్డంకిగా మారిందని గుర్తు చేశారు. 

గత కేసీఆర్ ప్రభుత్వం కూడా దీనిపై కేవలం లెటర్స్ రాయడానికే పరిమితమైందన్నారు. కానీ, కేంద్రంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక 'ఉడాన్' స్కీమ్‌‌‌‌‌‌‌‌తోనే ఈ 150 కిలోమీటర్ల నిబంధన నుంచి క్లియరెన్స్ లభించిందని, వరంగల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు కల సాకారమయ్యేందుకు రూట్ క్లియర్ అయిందని స్పష్టం చేశారు. కేవలం భూసేకరణ చేయకపోవడం వల్లే తెలంగాణలో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు పనులు లేట్ అయ్యాయని, 2028 నాటికి విమానాశ్రయం ప్రారంభిస్తామన్న సీఎం రేవంత్ మాటలు వట్టి ప్రగల్భాలే అని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు.