పెండ్లి చేసుకున్నాడు.. ఇంట్లోకి రానివ్వడం లేదు..భర్త ఇంటిముందు భార్య నిరసన.. గద్వాల జిల్లాలో ఘటన

పెండ్లి చేసుకున్నాడు.. ఇంట్లోకి రానివ్వడం లేదు..భర్త ఇంటిముందు భార్య నిరసన.. గద్వాల జిల్లాలో ఘటన

గద్వాల, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తన తల్లిదండ్రులు వద్దంటున్నారనే నెపంతో భార్యను ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆ నవవధువు న్యాయం కోసం భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామంలో బుధవారం జరిగింది. అనంతపురం గ్రామానికి చెందిన మాలిక్ అనే యువకుడు, గద్వాల పట్టణానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుని, మంగళవారం బీచుపల్లి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. 

అనంతరం అబ్బాయి ఇంటికి వెళ్లగా, అతడి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. ఇదే అదనుగా భర్త కూడా ‘నువ్వ నాకు వద్దు’ అంటూ ప్లేట్ ఫిరాయించాడు. దీంతో బాధితురాలు బుధవారం వారి ఇంటిముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని అమ్మాయిని టౌన్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.

 ఇదిలా ఉండగా ఇదివరకే ప్రేమ విషయంలోనే ఆ యువతి అతడిపై టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా,  కేసు నమోదైంది. ఈ నెలలో ఆ కేసు హియరింగ్ కు వస్తుండడంతో ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు తాజాగా పెండ్లి నాటకమాడి తల్లిదండ్రులు వద్దంటున్నారని ప్లేట్ ఫిరాయించినట్లు సమాచారం.