మక్తల్, వెలుగు : అన్యాయాన్ని ఎదిరించి, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మండలం ముస్లాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాయన్న కేవలం ముదిరాజ్ సామాజిక వర్గానికే కాకుండా బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిలిచిన ప్రజానాయకుడని, భూస్వాముల దోపిడీని ఎదిరించిన ఆయనను ప్రజలు తెలంగాణ రాబిన్హుడ్గా కొలుస్తారని తెలిపారు. పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల సీఎం రేవంత్రెడ్డికి ముదిరాజ్ సామాజిక వర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మక్తల్ పట్టణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి అండర్-19 బాలబాలికల కరాటే పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే విద్యార్థులలో ఆత్మరక్షణ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, ముఖ్యంగా బాలికలు ఇలాంటి ఆత్మరక్షణ నైపుణ్యాలను తప్పకుండా నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.
