- మండల అధ్యక్షుల నియామకంపై మైనంపల్లి, నర్సారెడ్డి వర్గాల ఫిర్యాదులు
హైదరాబాద్, వెలుగు: గజ్వేల్ కాంగ్రెస్‌లో మండల పార్టీ అధ్యక్షుల నియామకం కొత్త గొడవకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వర్గాల మధ్య విభేదాలు గాంధీ భవన్‌కు చేరాయి. మైనంపల్లి వర్గీయులు బుధవారం గాంధీ భవన్‌కు వెళ్లి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు.
నర్సారెడ్డి పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు నర్సారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. తనకు చెప్పకుండా, తన నియోజకవర్గంలోనే మైనంపల్లి మండల పార్టీ అధ్యక్షులను నియమించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. మండల అధ్యక్షుల నియామకంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు గాంధీ భవన్ వరకు వెళ్లడంతో గజ్వేల్ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరిగింది.
