ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కలకలం రేపుతోంది. 2026, జూన్ 26 నుంచి జూలై 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1 కేసు నమోదు అయ్యాయి. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన 12 మందిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నలుగురు మరణించినట్లు తెలిపింది. మృతులు కాకినాడ, గుంటూరు జిల్లాలకు చెందిన వారని పేర్కొంది.
మిగిలిన రోగులు వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. కేవలం 20 రోజుల్లోనే 12 కేసులు నమోదు కావడంతో పాటు నలుగురు మరణించడంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఈ మేరకు కొవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రోగులకు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో కోవిడ్ కేసులపై శుక్రవారం (జులై 17) సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి దేశంలో కూడా మళ్లీ విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ నెలలో 339 కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కేరళలో 115 కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్ & నికోబార్లో 8, ఢిల్లీలో 18, రాజస్థాన్‌లో 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడింది.
