నిర్మల్ జిల్లా ప్రజల గుండెకాయ, అన్నదాతల పాలిట కల్పవల్లి అయిన కడెం ప్రాజెక్టు.. ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతోంది. ఒకప్పుడు ఉరకలెత్తే జలాలతో కళకళలాడిన ఈ జలాశయం.. నేడు చుక్క నీరు లేక అడుగంటిపోయింది. ప్రాజెక్టు లోపల ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు, పిచ్చి మొక్కలు మొలిచి.. ఒక జలాశయంలా కాకుండా, చూసేవారికి అచ్చం ఎడారిని తలపిస్తోంది.
కడెం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 3.4 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 0.458 టిఎంసీల డెడ్ స్టోరేజ్ నీటి నిల్వ మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 2.4 టిఎంసీల నీరు పుష్కలంగా అందుబాటులో ఉంది. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.
ప్రాజెక్టు అడుగంటిపోవడంతో ఆయకట్టు రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సాగు నీరు దేవుడెరుగు.. కనీసం తాగునీటి కష్టాలు కూడా వచ్చి పడతాయేమోనని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. వరుణ దేవుడు కరుణించి.. ఎగువ ప్రాంతాల నుంచి ఎప్పుడు వరద నీరు వస్తుందా? ఈ ఎడారి లాంటి ప్రాజెక్టు ఎప్పుడు జలకళను సంతరించుకుంటుందా? అని ఆయకట్టు రైతులు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.
