నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 65.33 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో మొత్తం 7,31,632 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 4,77,958 మంది వివరాలను డిజిటలైజ్ చేశామని, ఆగస్టు 3 నాటికి 100 శాతం ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసి, సెప్టెంబర్ 9 వరకు కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అరుణ రెడ్డి ఉన్నారు.
