టోక్యో: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో సంచలన ప్రదర్శన చేసింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ పదో ర్యాంకర్ సింధు 21–16, 21–14తో వరల్డ్ ఐదో ర్యాంకర్ హాన్ యుయే (చైనా)పై గెలిచి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. బలమైన స్మాష్‌లు, క్రాస్ కోర్టు ర్యాలీస్‌తో అదరగొట్టిన ఇండియన్ ప్లేయర్ 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. తొలి గేమ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సింధు తర్వాత ర్యాలీలతో చెలరేగింది.
ఫలితంగా వరుసగా పాయింట్లు రాబట్టి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. రెండో గేమ్‌లోనూ అదే జోరు చూపెట్టిన సింధు 8–0 ఆధిక్యంలో నిలిచింది. మధ్యలో హాన్ తేరుకున్నట్లు కనిపించినా ఒకటి, రెండు పాయింట్లకే పరిమితమైంది. ఈ విజయంతో హాన్‌పై సింధు తన రికార్డును 8–1కి పెంచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల 20–22, 17–21తో టాప్‌సీడ్ ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు.
