- 18 రోజుల చిన్నారి మృతి
జోగిపేట, వెలుగు: భార్యభర్తల మధ్య జరిగిన గొడవ పసికందు మృతికి దారితీసింది. క్షణికావేశంలో తండ్రే చిన్నారిని నేలకేసి కొట్టి హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శనివారం జరిగింది. జోగిపేట ఎస్సై గిరి శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేటకు చెందిన పోతురాజు కృష్ణ(కిట్టు), అల్లం గౌరమ్మ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరికి 18 రోజుల క్రితం బాబు జన్మించాడు.
శనివారం భార్యాభర్తల మరోసారి గొడవ జరగడంతో కృష్ణ భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత ఆవేశంలో పసికందును రెండు కాళ్లు పట్టుకుని నేలకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గౌరమ్మ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చిన్నారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయగా, మార్గమధ్యలో చిన్నారి మృతిచెందాడు. బాధితురాలు గౌరమ్మ ఫిర్యాదు మేరకు కృష్ణపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
