రెబల్ ఎంపీల రగడ.. అఖిలపక్ష సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్

రెబల్ ఎంపీల రగడ.. అఖిలపక్ష సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్

న్యూఢిల్లీ: జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాలు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల అభ్యంతరాలు తెలుసుకోవడంతో పాటు సభను సజావుగా సాగేలా సహకరించాలని కోరేందుకు ఆదివారం (జులై 19) కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, టీఎంసీ, శివసేన (యూబీటీ) రెబల్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక వర్గాలుగా గుర్తించడంతో పాటు.. తిరుగుబాటు ఎంపీలను ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడాన్ని నిరసిస్తూ ఆల్ పార్టీ మీటింగ్ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అయితే, ఇది కేవలం ప్రతీకాత్మక నిరసన మాత్రమేనని స్పష్టం చేసిన ప్రతిపక్ష ఎంపీలు తిరిగి సమావేశానికి హాజరై చర్చలో పాల్గొన్నారు. 

ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ నుంచి ఆరుగురు లోక్ సభ ఎంపీలు షిండే శివసేనలో చేరిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ శివసేనకు లోక్ సభలో మొత్తం 9 మంది ఎంపీలు ఉండగా.. ఆరుగురు షిండే వర్గంలోకి జంప్ అయ్యారు. తమను షిండే వర్గంగా గుర్తించాలని రెబల్ ఎంపీలు లోక్ సభ స్పీకర్‎ను కోరారు. మూడింట రెండు వంతుల మంది పార్టీ ఫిరాయించడంతో షిండే వర్గంలో వీరి విలీనాన్ని స్పీకర్ ఆమోదించారు. 

అలాగే, ఎన్‌సీపీఐ పార్టీలో చేరిన 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలకు సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటుకు కూడా స్పీకర్ అనుమతి ఇచ్చారు. వీరిని ఆదివారం (జులై 19) అఖిలపక్ష సమావేశానికి కూడా ఆహ్వానించారు. దీంతో టీఎంసీ, శివసేన యూబీటీ ఎంపీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆల్ పార్టీ మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు.