తెలంగాణ అడవుల్లో  పెరుగుతున్న నక్కల విహారం..  

తెలంగాణ అడవుల్లో  పెరుగుతున్న నక్కల విహారం..  

తెలంగాణ అడవుల్లో స్మాల్ ఇండియన్ ఫాక్స్ (నక్కలు) మళ్లీ తమ ఉనికిని బలంగా చాటుతున్నాయి. ఒకప్పుడు అడవుల్లో అరుదుగా కనిపించిన ఈ వన్యప్రాణులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తుండటం అటవీశాఖ, వన్యప్రాణి శాస్త్రవేత్తలను ఆనందింపజేస్తోంది. అడవుల్లో ఆరోగ్యకరమైన జీవావరణం కొనసాగుతోందనడానికి నక్కలు పెరుగుతున్న సంఖ్య ఒక కీలక సూచికగా నిపుణులు పేర్కొంటున్నారు.

కవాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులతోపాటు ఏటూరునాగారం, పాఖాల్ అభయారణ్యాలు, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అడవుల్లో చిన్న నక్కల సంచారం గణనీయంగా పెరిగింది. అటవీశాఖ నిర్వహించిన కెమెరా ట్రాప్ అధ్యయనాలు, ఆక్యుపెన్సీ సర్వేలు, రోడ్డు ట్రాన్సెక్ట్ పరిశీలనలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎనగందుల వెంకట్ చెప్పారు.

ఇవి అటవీ గ్రామాల చెరువులు, వ్యవసాయ క్షేత్రాల దగ్గర కూడా కనిపిస్తున్నాయి. నక్కలు కేవలం వేటాడే జంతువులు మాత్రమే కావు. అడవిలో పర్యావరణ సమతుల్యతను కాపాడే సహజ శుభ్రత సిబ్బందిగా ఉపయోగపడతాయి. ఎలుకలు, కీటకాలు, పాములు, కుందేళ్లు, పక్షులు, చేపలు, పండ్లతో పాటు చనిపోయిన జంతువుల కళేబరాలను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో వ్యాధికారక సూక్ష్మజీవుల వ్యాప్తి తగ్గి అడవి పరిశుభ్రంగా ఉంటుంది. 

జంటగా జీవించే విశ్వాసానికి ప్రతీక

నక్కల జీవనశైలిలో కుటుంబ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణ. మగ, ఆడ నక్కలు దీర్ఘకాలిక జంట బంధాన్ని కొనసాగిస్తూ పిల్లలతో కలిసి జీవిస్తాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు సంభోగం జరిగి రెండు నెలల గర్భధారణ అనంతరం రెండు నుంచి ఆరు పిల్లలకు జన్మనిస్తాయి. రాతి సందులు, భూగర్భ బొరియలు, చెట్ల తొర్రలు, దట్టమైన పొదల్లో పిల్లలను సంరక్షిస్తాయి.

అడవిని దాటి గ్రామాలవైపు

ఇటీవలి కాలంలో అడవుల్లోనే కాకుండా అటవీ గ్రామాలు, చెరువులు, వ్యవసాయ క్షేత్రాల్లో కూడా నక్కలు కనిపిస్తున్నాయి. దీనికి అడవుల్లో ఆహార లభ్యతలో మార్పులు, గ్రామాల దగ్గర ఆహార వ్యర్థాలు అందుబాటులో ఉండటం ప్రధాన కారణాలుగా ఎక్స్​పర్ట్స్ భావిస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి మానవ – వన్యప్రాణి ఘర్షణలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.

రోడ్లే ప్రాణాంతక ఉచ్చు

నక్కలకు ప్రస్తుతం అతిపెద్ద ముప్పు రోడ్డు ప్రమాదాలే. ఆహారం కోసం రహదారులు దాటే సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వాటిని ఢీకొంటున్నాయి. కవాల్, అమ్రాబాద్, ఏటూరునాగారం, మంజీరా పరిసరాల్లో ఈ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. హనుమకొండ, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల నక్కలు ప్రమాదాలకు గురైన సంఘటనలు నమోదయ్యాయి.

కొన్నింటిని అటవీశాఖ సకాలంలో రక్షించి చికిత్స అందించగా, మరికొన్ని ప్రాణాలు కోల్పోయాయి. నక్కల ఆవాసాల ధ్వంసం, రోడ్డు ప్రమాదాలు, విష ప్రయోగం, మానవ వన్యప్రాణి సంఘర్షణలు, కుక్కల ద్వారా వ్యాధుల వ్యాప్తి వల్ల నక్కలు మరణిస్తున్నాయి. అడవుల నరికివేత, పట్టణీకరణ, గనుల తవ్వకాలు, రోడ్డు ప్రమాదాలతో నక్కలు మరణిస్తున్నాయి.

నక్కల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆహారం కోసం తిరుగుతూ, అటవీ ప్రాంతాలను కలిపే హైవే రోడ్లను దాటేటప్పుడు వాహనాలు ఢీకొంటున్నాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గునిపర్తి -శనిగారం రోడ్డుపై ఒక అరుదైన అడవి నక్క రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక ఆడ గోల్డెన్ జాకల్​ను అటవీశాఖ అధికారులు రక్షించారు. బెంగళూరు జాతీయ రహదారి దగ్గర వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఒక నక్కకు అక్కడి వైల్డ్ లైఫ్ హాస్పిటల్​లో చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేటలో తాజాగా ఓ నక్క ప్రమాదవశాత్తూ బావిలో పడిందని టైగర్ ప్రొటెక్షన్ సెల్​కు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది బావిలో నుంచి నక్కను కాపాడి దానికి చికిత్స చేయించి అడవిలో వదిలేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ గ్రామాల్లో నక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయని గ్రామస్థులు టైగర్ సెల్​కు చేసిన ఫిర్యాదుతో అటవీశాఖ సిబ్బంది స్పందించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు.

ఆవాసాలపై పెరుగుతున్న ఒత్తిడి

అడవుల నరికివేత, పట్టణాల విస్తరణ, గనుల తవ్వకాలు, వ్యవసాయ భూముల విస్తరణ, విషప్రయోగాలు, కుక్కల ద్వారా వ్యాధుల వ్యాప్తి వంటి అంశాలు నక్కల మనుగడకు సవాలుగా మారుతున్నాయి. ఆవాసాలు కుదించుకుపోవడంతో అవి మానవ నివాస ప్రాంతాలకు చేరువవుతున్నాయి.

జీవవైవిధ్యానికి బలమైన సంకేతం

నక్కల సంఖ్య పెరగడం కేవలం ఒక జాతి అభివృద్ధి మాత్రమే కాదు. అది అడవుల్లో ఆహార గొలుసు సమతుల్యత, పర్యావరణ ఆరోగ్యం, జీవవైవిధ్యం మెరుగ్గా ఉన్నాయని చెప్పే శాస్త్రీయ సూచిక. ఈ సహజ సంరక్షకులను కాపాడితేనే అడవులు ఆరోగ్యంగా నిలుస్తాయి. 

వేగ నియంత్రణ.. నక్కల ప్రాణాల రక్షణ

వన్యప్రాణుల సంరక్షణ కోసం అడవుల గుండా వెళ్లే రహదారులపై వాహనాల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేయాలని అటవీశాఖ చర్యలు చేపట్టింది. ప్రమాదకర ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, వన్యప్రాణులు రోడ్లు దాటేందుకు అండర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు, ఓవర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది.

అడవుల్లోని నక్కలు నక్కలు, వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మరణించకుండా నివారించేందుకు వీలుగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం రోడ్లపై వాహనాల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు నియంత్రిస్తూ తాము ఆదేశాలు జారీ చేశామని జన్నారం అటవీశాఖ సీనియర్ అధికారి ఎం. రామ్మోహన్ చెప్పారు. వన్యప్రాణులు తిరుగుతున్న రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు తాము బారి కేడ్లను ఏర్పాటుచేశామన్నారు.

జన్యుపరంగా విలువైన జాతి

1994 నుంచి 2012 వరకు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన నక్కల నుంచి సేకరించిన కణజాల నమూనాలపై నిర్వహించిన జన్యు అధ్యయనంలో తెలంగాణ నక్కలు దక్షిణ భారత జనాభాకు చెందినవే అయినప్పటికీ, మధ్య భారత జనాభాతో జన్యుపరమైన మిశ్రమ లక్షణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైవిధ్యం భవిష్యత్ పరిశోధనలకు కీలకంగా భావిస్తున్నారు.