‘అమ్మా.. సెలవులు ఇంకో నాలుగు రోజులు ఉంటే ఎంత బాగుండో!’ మంచంపై అటు ఇటూ దొర్లుతూ నీరసంగా మూలిగాడు పదేళ్ల సమీర్. ‘ఎందుకు నాన్నా?’ అంది అమ్మ నవ్వుతూ. ‘మళ్లీ అదే రొటీన్ అమ్మా.. పొద్దున్నే లేవడం, స్కూల్ బస్సు, హోంవర్కులు, పరీక్షలు.. చాలా బోర్!’ అంటూ ముఖంపై దిండు పెట్టేసుకున్నాడు.
అమ్మ అల్మారాలోంచి సూపర్ హీరో బొమ్మ ఉన్న ఒక కొత్త స్కూల్ బ్యాగ్ తీసి సమీర్ పక్కన పెట్టింది. అది చూసి టక్కున బ్యాగ్‌ని అందుకున్నాడు. అందులోని కొత్త పుస్తకాల వాసన, రంగుల పెన్సిళ్లు చూసి.. క్షణంలో ముఖం వెలిగిపోయింది. మరుసటిరోజు రానే వచ్చింది. కానీ ఆ కొత్త వస్తువుల మురిపెం కాస్తా కరిగిపోయింది. కొత్త యూనిఫాం వేసుకున్నా, మెరిసే షూస్ తొడుక్కున్నా సమీర్ ముఖంలో ఉత్సాహం లేదు. బయట స్కూల్ బస్ హారన్ కొట్టింది. అయిష్టంగానే వెళ్లి బస్ ఎక్కాడు.
స్కూల్ గేటు దగ్గరకు రాగానే బస్సు ఆగింది. గేటు అవతల, ఒక చెట్టు నీడన తన ఈడు పిల్లాడు నిలబడి ఉండడం చూశాడు. కానీ అతని ఒంటిపై యూనిఫాం లేదు, కాళ్లకు చెప్పులు లేవు. చిరిగిన పాత అంగీ వేసుకుని, చేతులు వెనకకు కట్టుకుని, స్కూల్ లోపలికి వెళ్తున్న పిల్లల వైపు ఆశగా, ఆరాటంగా చూస్తున్నాడు.
సమీర్, ఆ పిల్లాడి దగ్గరకెళ్లి... ‘నువ్వు లోపలికి రావా? బెల్ కొట్టేస్తున్నారు’ అని అడిగాడు. ఆ పిల్లాడు సమీర్ చేతిలోని మెరుస్తున్న సూపర్ హీరో బ్యాగ్‌ని ఒకసారి చూసి, చిన్నగా నవ్వాడు. “నువ్వు ఈ స్కూల్ కాదా?’ అమాయకంగా అడిగాడు సమీర్. ‘లేదు.. నాన్న ఈసారి ఫీజులు కట్టలేకపోయాడు. పుస్తకాలు కూడా కొనలేదు. అందుకే ఈ ఏడాదికి చదువు ఆపేశారు. నాన్నకు తోడుగా నేను కూడా పనికి వెళ్తున్నా’ అని చెప్పాడు.
కొద్దిసేపటి క్రితం వరకు ‘స్కూల్‌కి వెళ్లడం ఒక భారం’ అనుకున్న తన ఆలోచన ఎంత తప్పో సమీర్కి అప్పుడర్థమైంది. మధ్యాహ్నం క్లాస్ టీచర్ క్లాసులోకి వచ్చి ‘వెల్‌కమ్ బ్యాక్ చిల్డ్రన్! ఈ కొత్త విద్యా సంవత్సరంలో మీ లక్ష్యం ఏంటో ఒక్కొక్కరు చెప్పండి?’ అంది.
‘నేను డాక్టర్ అవుతాను మేడమ్!’ అంది వర్ష.
‘నేను స్పేస్ సైంటిస్ట్ అవుతాను!’ అన్నాడు నిఖిల్.
కానీ సమీర్ మౌనంగా కూర్చున్నాడు. టీచర్ సమీర్ దగ్గరకు వచ్చి, ‘ఏంటి సమీర్, కొత్త బ్యాగ్ చాలా బాగుంది.. నీ గోల్ ఏంటి?’ అని అడిగింది.
సమీర్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు.‘మేడమ్... నాకు ఈరోజు ఒక పెద్ద విషయం అర్థమైంది. స్కూల్‌కి రావడం, చదువుకోవడం అనేది అందరికీ దొరికే మామూలు విషయం కాదు, అది ఒక పెద్ద అదృష్టం. బయట చదవాలని ఆశ ఉండి కూడా చదవలేని పిల్లలు ఉన్నారు. నాకు అన్ని వసతులూ ఇచ్చినందుకు మా అమ్మనాన్నలకి నేను కృతజ్ఞతగా ఉండాలి. ఈ ఏడాది నేను కేవలం మార్కుల కోసం కాదు, నాకు దొరికిన ఈ గొప్ప అవకాశాన్ని గౌరవించడం కోసం చాలా బాగా చదువుతాను’.
క్లాస్ రూమ్ అంతా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. పిల్లలందరూ సమీర్ వైపు ఆశ్చర్యంగా చూశారు.
టీచర్ కళ్లల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె సమీర్ భుజం తట్టి, ‘చాలా అద్భుతంగా చెప్పావు సమీర్. విద్య అనేది భారం కాదు, అది జీవితాన్ని మార్చే ఒక అపురూపమైన అవకాశం. ఆ విలువ తెలుసుకున్నప్పుడే నిజమైన చదువు మొదలవుతుంది’ అన్నారు. క్లాస్ రూమ్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
సాయంత్రం ఇంటికి వచ్చిన సమీర్ తన కొత్త బ్యాగ్‌ను జాగ్రత్తగా స్టడీ టేబుల్‌పై సర్ది, ఇవాళ జరిగిందంతా వాళ్లమ్మతో చెప్పాడు. మర్నాడు లేవగానే ‘ఈరోజు స్కూల్ బస్సు కంటే ముందే నేను గేట్ దగ్గర ఉండాలి. నేర్చుకోవడానికి చాలా ఉంది!’ అని వాళ్లమ్మతో చెప్పాడు.అమ్మ ముఖంలో గర్వం కనిపించింది. ఎందుకంటే సమీర్‌కు ఇప్పుడు పుస్తకాల్లోని పాఠాలే కాదు... జీవితపు విలువల పాఠం కూడా అర్థమైంది!
- యండి. ఉస్మాన్ ఖాన్
