తెలంగాణ పల్లెటూరి వాతావరణం, మనుషుల అమాయకత్వం, మమకారాల నేపథ్యంలో తెరకెక్కిన రూరల్ ఫ్యామిలీ డ్రామా 'పళ్ళబురుసు'. ఇప్పుడు ఈ మూవీ సడన్‌గా డిజిటల్ స్పేస్‌లోకి వచ్చేసింది. ఆగస్టు 14, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
'పళ్ళబురుసు' కోసం కొడుకుపై కేసా?
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ చాలా విభిన్నంగా, కామెడీగా సాగుతుంది. పంటి నొప్పితో బాధపడుతున్న శంభు అనే వృద్ధుడికి, వేపపుల్ల మానేసి పళ్ళబ్రష్ వాడాలని డాక్టర్ సలహా ఇస్తాడు. దాంతో శంభు తన కొడుకు తిరుపతిని ఒక 'పళ్ళబురుసు' కొనిమ్మని అడుగుతాడు. కానీ, కొడుకు ఆ చిన్న కోరికను అస్సలు పట్టించుకోకపోగా, తండ్రికి చెప్పకుండానే మనవడి పెళ్లి నిశ్చయించేస్తాడు. కొడుకు ప్రవర్తనతో తీవ్రంగా గాయపడిన ఆ తండ్రి.. 'నాకు పళ్ళబురుసు కూడా కొనివ్వట్లేదు' అంటూ కొడుకుపై అధికారులకు ఫిర్యాదు చేసి కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఒక్క పళ్ళబ్రష్ వల్ల మొదలైన రచ్చ చివరకు ఎటు దారితీసింది అనేది ఈ సినిమా ఆసక్తికరమైన పాయింట్.
నాగార్జున సమర్పణలో..
ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మా, అంజి మామ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా కథ నచ్చడంతో అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై దీనిని విడుదల చేశారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, కుటుంబ సంబంధాలు, పల్లెటూరి మనస్తత్వాల చుట్టూ సాగే ఈ కథ ఓటీటీ ఆడియెన్స్‌ను మాత్రం బాగా అలరిస్తోంది.
►ALSO READ | I'm Game Review: యాక్షన్ థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్' రివ్యూ: దుల్కర్ ఖాతాలో హిట్ పడినట్టేనా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
ఇప్పుడు ఈ 'పళ్ళబురుసు' మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ వీకెండ్ లైట్-హార్టెడ్ ఫ్యామిలీ డ్రామాను అమెజాన్ ప్రైమ్‌లో మిస్ కాకుండా చూసేయండి మరి.
