జాతీయ సినిమా అవార్డుల్లో..సత్తా చాటిన టాలీవుడ్

జాతీయ సినిమా అవార్డుల్లో..సత్తా చాటిన టాలీవుడ్
  • ఉత్తమ తెలుగు  చిత్రంగా కమిటీ కుర్రోళ్లు
  • ఉత్తమ ప్రజాదారణ సినిమాగా కల్కీ
  • బెస్ట్​ స్ర్కీన్ ప్లే రైటర్​ సుకుమార్ (పుష్ప2)
  • 9 విభాగాల్లో తెలుగు సినిమాలకు అవార్డులు
  • ఉత్తమ జాతీయ చిత్రంగా ఆర్టికల్​ 370
  • 72వ జాతీయ అవార్డులు.. సత్తా చాటిన టాలీవుడ్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనతో మరోసారి తెలుగు సినీ ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.  2024 సంవత్సరానికి మొత్తం 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు  రాగా, వాటిలోనుంచి బెస్ట్ మూవీస్, బెస్ట్ యాక్టర్స్,  బెస్ట్ టెక్నీషియన్స్‌‌కు   కేంద్ర ప్రభుత్వం శనివారం అవార్డులు  ప్రకటించింది.  ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు సినీ ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఎవరు ఏ విభాగంలో అవార్డు అందుకున్నారు? ఏ సినిమాలు ఈసారి జాతీయ స్థాయిలో మెరిశాయి? అవార్డుల పూర్తి విశేషాలు.

దేశ రాజకీయాల నేపథ్యంలో ‘ఆర్టికల్ 370’ 

2024లో విడుదలైన  ‘ఆర్టికల్ 370’ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన   ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.  జమ్మూ-కాశ్మీర్‌‌కు ప్రత్యేక హోదా కల్పించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చుట్టూ జరిగిన పరిణామాలను కల్పిత కథనంతో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది.  జాతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, రాజకీయ నిర్ణయాల ప్రభావం వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించడం ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.  ఇప్పుడు జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవాల్లో ఒకటైన ఉత్తమ చిత్రం అవార్డును అందుకోవడం ద్వారా మరో మైలురాయిని చేరుకుంది. 

‘భ్రమయుగం’లో భయానకమైన నటనా వైభవం

ఉత్తమ నటుడు కేటగిరీలో నాలుగు దశాబ్దాలుగా నటనలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మమ్ముట్టి  (భ్రమయుగం),  తన కెరీర్‌‌లోనే అత్యంత సవాల్‌‌తో కూడిన పాత్రను పోషించిన కార్తీక్ ఆర్యన్  (చందు ఛాంపియన్) అవార్డులకు ఎంపికయ్యారు. మలయాళ మెగాస్టార్‌‌‌‌గా పేరొందిన   మమ్ముట్టి,  ‘భ్రమయుగం’ చిత్రంలో  పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించారు. బ్లాక్ అండ్ వైట్ విజువల్స్‌‌తో తెరకెక్కిన ఈ సైకలాజికల్ హారర్ డ్రామాలో ఆయన పోషించిన రహస్యమైన భూస్వామి పాత్ర ప్రేక్షకులతోపాటు విమర్శకులను ఆకట్టుకుంది.  ఆయన చూపించిన హావభావాలు, కళ్లతోనే భయాన్ని పండించిన తీరు ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. పెద్దగా డైలాగ్స్  లేకుండానే పాత్రలోని క్రూరత్వంతో భయపెట్టడం ఆయన అనుభవానికి నిదర్శనం.  అందుకే  ‘భ్రమయుగం’ చిత్రం  మమ్ముట్టి కెరీర్‌‌లో మరో మైలురాయిగా నిలిచింది. 

‘చందు ఛాంపియన్’తో ఇమేజ్‌‌కు భిన్నమైన ప్రయోగం

ఇప్పటివరకు ఎక్కువగా రొమాంటిక్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కార్తీక్ ఆర్యన్, ‘చందు ఛాంపియన్’ తో తనలోని నటుడిని కొత్త కోణంలో చూపించాడు.  భారత పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పెట్కర్ జీవితం  ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన డెడికేషన్  స్పష్టంగా కనిపించింది.  పాత్ర కోసం నెలల తరబడి కఠినమైన శిక్షణ తీసుకోవడం, శారీరకంగా పూర్తిగా మారిపోవడం, భావోద్వేగ సన్నివేశాల్లో సహజ నటన ప్రదర్శించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ముఖ్యంగా ఓటమి నుంచి విజయానికి చేరుకున్న క్రీడాకారుడి జీవిత పోరాటాన్ని  హార్ట్‌‌ఫుల్‌‌గా చూపించాడనే  ప్రశంసలు దక్కాయి.  ఈ సినిమా  కార్తీక్ కెరీర్‌‌లో టర్నింగ్ పాయింట్‌‌గా నిలిచింది.

ఉత్తమ నటి: యామీ గౌతమ్ 

ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘ఆర్టికల్ 370’ చిత్రానికిగాను ఉత్తమ నటిగా యామీ గౌతమ్ ఎంపికైంది.  రొమాంటిక్ పాత్రలతో కెరీర్‌‌ను ప్రారంభించిన యామీ గౌతమ్, గత కొన్నేళ్లుగా కంటెంట్ ఓరియెంటెడ్  సినిమాలను ఎంచుకుంటూ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది.  ‘ఆర్టికల్ 370’  చిత్రంలో ఆమె నటించిన  పవర్‌‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌‌కు ఉత్తమ నటిగా  గుర్తింపు దక్కడం విశేషం.  ఇందులో  జూనీ హక్సర్  అనే ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో  యామీ గౌతమ్ కనిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.  దేశ ప్రయోజనాల కోసం వ్యక్తిగత భావోద్వేగాలను పక్కన పెట్టే అధికారిగా ఆమె  నటించిన తీరు ప్రశంసలు అందుకుంది.

ధనుష్ డబుల్ ధమాకా

72వ జాతీయ అవార్డుల్లో ధనుష్ డబుల్ ధమాకా అందుకున్నారు.   ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’  ఉత్తమ తమిళ చిత్రంగా  ఎంపిక కాగా, మరోవైపు ఆయన ప్రధాన పాత్రలో నటించిన  ‘కెప్టెన్ మిల్లర్’  బెస్ట్ ఫీచర్ ఫిల్మ్  అవార్డును దక్కించుకుంది. ఒకే ఏడాదిలో ధనుష్ నటించిన రెండు చిత్రాలు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు పొందడం విశేషం. 

‘కల్కి’ నుంచి ‘కమిటీ కుర్రాళ్లు’ వరకు 

72వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండింది.  తొమ్మిది విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి.  పుష్ప 2, కల్కి లాంటి భారీ బడ్జెట్‌‌ సినిమాలతో పాటు ‘లక్కీ భాస్కర్‌‌‌‌’ లాంటి మిడ్‌‌ రేంజ్ సినిమా, కమిటీ కుర్రాళ్లు, 35 ఒక చిన్న కథ కాదు చిన్న చిత్రాలు అవార్డులు గెలుచుకోవడం విశేషం. 

స్క్రీన్‌‌ప్లే రైటర్‌‌‌‌గా.. తగ్గేదేలే

69వ జాతీయ అవార్డుల్లో ‘పుష్ప’ చిత్రం అల్లు అర్జున్‌‌ను జాతీయ స్థాయిలో బెస్ట్‌‌ యాక్టర్‌‌‌‌గా నిలబెట్టిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌‌గా వచ్చిన ‘పుష్ప 2’ చిత్రం 72వ నేషనల్‌‌ అవార్డ్స్‌‌లో రెండు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. తన స్క్రీన్‌‌ప్లే, మేకింగ్ స్టైల్‌‌తో సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన దర్శకుడు సుకుమార్‌‌‌‌కు బెస్ట్ స్క్రీన్‌‌ ప్లే రైటర్‌‌‌‌గా అవార్డు వరించింది. 3 గంటల 21 నిమిషాల నిడివి గల సినిమాను ఎక్కడా బోర్‌‌‌‌ కొట్టించకుండా ఉత్కంఠగా కథను నడిపిస్తూ, యాక్షన్‌‌కు ఎమోషన్‌‌ను మిక్స్‌‌ చేస్తూ, ప్రతి క్యారెక్టర్‌‌‌‌కు ఇంపార్టెన్స్​ ఇస్తూ స్క్రీన్‌‌ప్లేతో మేజిక్‌‌ చేశారు సుకుమార్. అలాగే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌‌ర్‌‌గా దీపాళి నూర్‌‌, షీత‌‌ల్ శ‌‌ర్మకు అవార్డు లభించింది.  

మనీ వర్సెస్‌‌ మిడిల్ క్లాస్‌‌ డైలాగ్స్‌‌తో..   

దుల్కర్ సల్మాన్ హీరోగా సితార  సంస్థ నిర్మించిన ‘లక్కీ భాస్కర్‌‌‌‌’ సినిమాకు గాను చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి  ఉత్తమ డైలాగ్‌‌ రైటర్‌‌‌‌గా ఎంపికయ్యారు. ‘‘కష్టం వస్తే భరిస్తాం.. అదే పంతం వస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం..”అంటూ మిడిల్ క్లాస్‌‌ మెంటాలిటీ గురించి,  నేను వెళ్లింది నగలు కొనడానికి మాత్రమే కాదు.. వాడి అహంకారాన్ని కూడా కొనడానికి..’ లాంటి డైలాగ్స్‌‌తో డబ్బుతో వచ్చే ఆత్మవిశ్వాసం గురించి,  ‘‘దిస్‌‌ ఈజ్ ఇండియా..  వస్తువు కొనాలంటే డబ్బుతో కొనాలి. కానీ రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు మన ఒంటి మీద కనపడాలి..” అంటూ డబ్బు విలువ గురించి ఆలోచింపజేసేలా వెంకీ అట్లూరి రాసిన డైలాగ్స్‌‌ సినిమా విజయంలో కీరోల్ ప్లే చేశాయి.

హోల్‌‌సమ్ ఎంటర్‌‌టైనర్‌‌‌‌ 

‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రెండు కేటగిరీల్లో అవార్డులను గెలుచుకుంది.  ఇండియన్‌‌ మైథాలజీకి సైన్స్‌‌ ఫిక్షన్‌‌ జోడించి నాగ్ అశ్విన్‌‌ తెరకెక్కించిన  ఈ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం (హోల్‌‌సమ్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్)గా నిలిచింది. అలాగే అద్భుతమైన సెట్స్‌‌, విజువల్స్‌‌తో తెరపై సినిమా అద్బుతంగా ఆవిష్కరించడానికి కారణమైన  నితిన్ జిహాన్ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌‌గా అవార్డుకు ఎంపికయ్యారు.  

‘కమిటీ కుర్రోళ్లు’ మళ్లీ కొట్టారు 

నిహారిక కొణిదెల నిర్మాతగా యదువంశీ తెరకెక్కించిన  ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఈసారి జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. గ్రామీణ నేపథ్యంలో స్నేహితుల మధ్య అనుబంధాలు, యువత ఎదుర్కొనే సమస్యలు, రాజకీయాలు,  కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథ ఇది.  కొత్త నటీనటులను సహజసిద్ధంగా చూపించడంలో కీలక పాత్ర పోషించిన పి. రవికుమార్ 'బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్' అవార్డును  గెలుచుకున్నారు.  గ్రామీణ వాతావరణాన్ని సహజత్వానికి దగ్గరగా చూపిస్తూ ఎమోషన్‌‌తో పాటు ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ మిక్స్ చేస్తూ యదు వంశీ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. మౌత్‌‌ టాక్‌‌తో థియేటర్స్‌‌లో సూపర్ సక్సెస్ సాధించిన ఈ చిత్రం గద్దర్ అవార్డుల్లో సత్తా చాటడంతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డుల్లోనూ మెప్పించింది.  

చిన్న కథ.. పెద్ద సందేశం

నివేదా థామస్ ప్రధాన పాత్రలో నందకిషోర్ ఈమాని తెరకెక్కించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం.. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. పిల్లల జీవితాల్లో మార్కుల ఒత్తిడి, తల్లిదండ్రుల ఆశలు, చదువు పేరుతో పెరుగుతున్న మానసిక భారం, చిన్నారుల భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు లాంటి అంశాలను హృదయానికి హత్తుకునేలా ఇందులో ఆవిష్కరించారు. భావోద్వేగ సన్నివేశాల్లో అత్యుత్తమ నటన కనబరచిన అరుణ్ దేవ్‌‌ పోతుల ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యాడు. 

విజేతలు వీరే :

  • ఉత్తమ నటుడు  : మమ్ముట్టి (భ్రమయుగం), 
  • కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)
  • ఉత్తమ నటి : యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
  • ఉత్తమ చిత్రం : ఆర్టికల్ 370 
  • (ఆదిత్య సుహాస్ జంబాలే) 
  • ఉత్తమ దర్శకుడు: అమరన్‌‌ 
  • (రాజ్‌‌కుమార్‌‌ పెరియసామి)
  • ఉత్తమ సహాయ నటి:  
  • మహారాజ (సచన నమిదాస్‌‌), 
  • మిథ్య (రూపశ్రీ వర్కాడే)
  • ఉత్తమ సహాయ నటుడు: భక్షక్‌‌ (సంయ్‌‌ మిశ్రా)
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ
  • ఉత్తమ జాతీయ విలువల చిత్రం : 
  • కెప్టెన్ మిల్లర్ (అరుణ్ మాథేశ్వరన్) 
  • ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : రణ్‌‌దీప్ హుడా (స్వాతంత్ర్య వీర్ సావర్కర్) 
  • ఉత్తమ  స్క్రీన్‌‌ప్లే రైటర్: సుకుమార్ ( పుష్ప 2 )
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: 
  • శీతల్ శర్మ (పుష్ప 2), దీపాలీ నూర్
  • ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
  • ఉత్తమ బాల నటుడు: అరుణ్‌‌దేవ్‌‌ పోతుల 
  • (35 చిన్నకథ కాదు) 
  • ఉత్తమ మేకప్ : పి. రవికుమార్‌‌  (కమిటీ కుర్రాళ్లు) 
  • ఉత్తమ సంగీతం  (నేపథ్యం):  
  • జీవీ ప్రకాశ్ కుమార్‌‌ (అమరన్) 
  • ఉత్తమ సంగీతం (సాంగ్స్) : శశ్వాంత్ సచ్‌‌దేవ్ (ఆర్టికల్ 370) 
  • ఉత్తమ సౌండ్ డిజైన్ : మానస్ చౌదరి)
  • భూల్ భూలయ్య 3) 
  • ఉత్తమ  ప్రొడక్షన్‌‌ డిజైనర్‌‌:  నితిన్‌‌ జిహానీ  
  • (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ : షెహనాద్ జలాల్ (భ్రమయుగం) 
  • ఉత్తమ ఎడిటింగ్ : ఆర్ కలైవానన్ (అమరన్) 
  • ఉత్తమ యాక్షన్‌‌: మహారాజా (తమిళ్)
  • ఉత్తమ కొరియోగ్రఫీ : విజయ్ గంగూలీ 
  • (ఆజ్ కిరాత్ –స్త్రీ2) 
  • ఉత్తమ గీత రచయిత : మనోజ్ ముంతాషిర్ 
  • (జానేదో – మైదాన్) 
  • ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలు  : 
  • ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్లు
  • ఉత్తమ తమిళ చిత్రం: రాయన్
  • ఉత్తమ మరాఠీ చిత్రం: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి
  • ఉత్తమ ఒడియా చిత్రం: లహరి
  • ఉత్తమ మలయాళ చిత్రం : ఫెమినిచ్చి ఫాతిమా
  • ఉత్తమ కన్నడ చిత్రం : మిథియా
  • ఉత్తమ హిందీ చిత్రం : శ్రీకాంత్
  • ఉత్తమ గుజరాతీ చిత్రం : మారన్
  • ఉత్తమ బెంగాలీ చిత్రం : చలిచిత్ర ఎకోన్ 
  • ఉత్తమ అస్సామీ చిత్రం : జుయ్‌‌ఫిల్మ్ 
  • (ఆరెంజ్ అండ్ పర్పుల్) 
  • ఉత్తమ తుళు చిత్రం: ఇంబు
  • ఉత్తమ గర్వాలీ చిత్రం: ధోలి