- గుట్టు రట్టు చేసిన పోలీసులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు
ఎల్బీనగర్, వెలుగు: సాధారణ ఉప్పునకు రంగు కలిపి, బ్రాండెడ్ కంపెనీల సంచుల్లో నింపి రైతులను మోసం చేస్తున్న నకిలీ ఎరువుల ముఠా గుట్టును పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు రట్టు చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ప్రారంభమైన విచారణతో హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేటలో నకిలీ ఎరువుల తయారీ కేంద్రాన్ని గుర్తించి భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో కొందరు తక్కువ ధరకే డీఏపీ, ఇతర ఎరువులు విక్రయించారు. వాటి నాణ్యతపై అనుమానం వచ్చిన ఓ రైతు పోలీసులను ఆశ్రయించడంతో విచారణ ప్రారంభమైంది. హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టగా, ఎరువులు హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట నుంచి వస్తున్నట్లు తేలింది.
దీంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు పెద్ద అంబర్‌పేటలోని హరిత కాలనీలో ఉన్న ఓ కోళ్ల ఫారంపై దాడులు నిర్వహించారు. గత రెండు నెలలుగా అద్దెకు తీసుకున్న ఆ ఫారంలో యంత్రాలతో నకిలీ ఎరువులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ సుమారు 5 వేల బస్తాలకు పైగా నకిలీ డీఏపీ, పొటాష్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉప్పును పోటాష్, డీఏపీగా మార్చి..
దర్యాప్తులో సాధారణ ఉప్పునకు ఎరుపు రంగు కలిపి పొటాష్‌గా, బయో గుళికలను డీఏపీగా మార్చి ప్రముఖ కంపెనీల సంచుల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు బయటపడింది. తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ నకిలీ ఎరువులను ఒక్కో బస్తా సుమారు రూ.1,500కు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఉన్న యంత్రాలు, రసాయనాలు, ఖాళీ బ్రాండెడ్ సంచులను అధికారులు సీజ్ చేశారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు నకిలీ ఎరువుల సరఫరాపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
