ఈపీఎఫ్ఓ స్కీమ్ 2026లో వచ్చిన మార్పులతో ఉద్యోగులకు తమ వేతనంలో ఎంత శాతం PFకు కేటాయించాలో ఎంచుకునే అవకాశం లభించనుంది. 12 శాతం, 9 శాతం లేదా నెలకు రూ.1,800 స్థిర చందా వంటి ఆప్షన్లు ఉండటంతో ప్రస్తుతం చేతికి వచ్చే జీతం పెంచుకోవచ్చనే భావన కలగొచ్చు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఈ నిర్ణయం కేవలం ఎక్కువ టేక్ హోమ్ జీతం కోసం తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. చిన్న మొత్తంలో తగ్గించే పొదుపు కూడా 25-30 ఏళ్ల తర్వాత భారీ రిటైర్మెంట్ లోటుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఉద్యోగి వయసు, రిటైర్మెంట్ వరకు ఉన్న సమయం, పెట్టుబడి అలవాట్లు, పన్ను పరిస్థితులు, ఇప్పటికే ఉన్న రిటైర్మెంట్ నిధి వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని AUM Wealth Pvt. Ltd. వ్యవస్థాపకుడు, CFP అమిత్ సూరి అన్నారు. 12 శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్ క్రమశిక్షణతో పొదుపు చేయలేని వారికి కూడా రక్షణ కల్పించే ఉత్తమ ఎంపికగా ఉంటుంది. 9 శాతం కాంట్రిబ్యూషన్ మాత్రం హోమ్ లోన్ EMIలు, పిల్లల చదువు, అత్యవసర నిధి వంటి తక్షణ అవసరాలు ఉన్న వారికి కొంత వెసులుబాటు ఇవ్వొచ్చు.
ALSO READ : రూ.65 కోట్ల టాక్స్ రీఫండ్ స్కామ్ బట్టబయలు..
రూ.1,800 స్థిర కాంట్రిబ్యూషన్ ఆప్షన్ ఎంపిక మాత్రం అదనంగా మిగిలే డబ్బును క్రమం తప్పకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, NPS వంటి పెట్టుబడుల్లో పెట్టగలిగే ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుంది. “ఈ రోజు ఎంత ఎక్కువ జీతం వస్తుంది?” అనే దానికంటే “మిగిలిన మొత్తాన్ని నిజంగా భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతానా?” అనే ప్రశ్న ముఖ్యమని సూరి సూచించారు.
ఉదాహరణకు నెలకు రూ.50వేలు EPF వేతనం ఉన్న ఉద్యోగి 30 ఏళ్ల పాటు 8 శాతం రాబడితో పొదుపు చేస్తే.. 12 శాతం కాంట్రిబ్యూషన్ ద్వారా వచ్చే మొత్తం కంటే 9 శాతం ఎంపికలో తగ్గిన రూ.1,500 నెలవారీ మొత్తం భవిష్యత్తులో దాదాపు రూ.22-25 లక్షల తేడాను సృష్టించవచ్చు. రూ.1,800 ఎంపికలో ఈ లోటు రూ.60-70 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. అందుకే ఎక్కువ మంది ఉద్యోగులకు 12 శాతం EPF సురక్షితమైన డిఫాల్ట్ ఎంపికగా నిపుణులు అంటున్నారు.
