ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (జేయూఐ-ఎఫ్) అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ సవాల్ విసిరారు. మునీర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే యూనిఫామ్ తీసేసి రావాలని ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయో.. ఎంత మేర ప్రజా బలం ఉందో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. పాక్ ప్రభుత్వం, ఆర్మీలో మునీర్ మితిమీరిన జోక్యం నేపథ్యంలో ఫజలుర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆప్ఘాన్ తాలిబన్లకు గట్టి మద్దతుగా ఉండే ఫజలుర్ రెహమాన్ లేటేస్ట్ కామెంట్స్‌తో పాకిస్తాన్ ప్రభుత్వంలో సైన్యం జోక్యం ఏ విధంగా ఉంటుందో మరోసారి రుజువైంది. పాకిస్తాన్ సర్వశక్తిమంతుడైన ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను టార్గెట్ చేయడంతో ఫజలుర్ రెహమాన్ గురించి చర్చ మొదలైంది. అసలు ఎవరీ ఇయనా.. పాక్‌లో మోస్ట్ పవర్ ఫుల్ వ్యక్తుల్లో ఒకరైన మునీర్‌ను ఎందుకు టార్గెట్ చేశారనే జోరుగా చర్చ జరుగుతోంది.
అసలు ఎవరీ ఫజలుర్ రెహమాన్..?
జమియత్ ఉలేమా-ఎ ఇస్లాం పార్టీ వ్యవస్థాపకుడు, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (ప్రస్తుతం ఖైబర్ పఖ్తూన్ఖ్వా) మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమూద్ కుమారుడే మౌలానా ఫజలుర్ రెహమాన్. పాకిస్తాన్‌లో అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిస్ట్ రాజకీయ నాయకులలోఒకరైన ఈయన ఆప్ఘాన్ తాలిబన్లకు అనుకూలంగా ఉంటారు.
పాక్‌లో షరియా చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని పదే పదే డిమాండ్ చేయడంతో పాటు పాకిస్తాన్ రాజకీయాలలో సైన్యం ఆధిపత్యాన్ని గట్టిగా విమర్శిస్తుంటారు. మునీర్‌ను విమర్శించడం ఆయనకు ఇదే తొలిసారి కాదు. గత ఏడాది డిసెంబర్‌లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) వంటి ఉగ్రవాద గ్రూపులపై ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి దాడులు జరిపే ఇస్లామాబాద్ వ్యూహాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
