భారత ఐటీ రంగానికి AI భారీ అవకాశం.. భయం వద్దంటున్న ఆనంద్ మహీంద్రా

భారత ఐటీ రంగానికి AI భారీ అవకాశం.. భయం వద్దంటున్న ఆనంద్ మహీంద్రా

ఏఐ కారణంగా భారత ఐటీ సేవల రంగం దెబ్బతింటుందనే అంచనాలను టెక్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొట్టిపారేశారు. టెక్ మహీంద్రా 39వ ఏజీఎంలో మాట్లాడుతూ.. ప్రతి కొత్త టెక్నాలజీ విప్లవం వచ్చినప్పుడల్లా ఇలాంటి భయాలు సహజమేనని పేర్కొన్నారు. అయితే AI వల్ల ఐటీ సేవల ప్రాధాన్యం తగ్గదని, వాటి స్వరూపం మాత్రమే మారుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సంస్థలకు ఏఐను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేయడంలో ఐటీ కంపెనీల పాత్ర మరింత కీలకంగా మారుతుందని చెప్పారు.

ప్రస్తుతం AI కేవలం ఉత్పాదకతను పెంచే సాధనం మాత్రమే కాదని, వ్యాపారాలు ఎలా పనిచేయాలి, వినియోగదారులకు ఎలా సేవలు అందించాలి, రిస్క్‌ను ఎలా నిర్వహించాలి, కీలక నిర్ణయాలను ఎలా తీసుకోవాలి అనే అంశాలన్నింటిలోనూ కేంద్ర స్థానాన్ని ఆక్రమిస్తోందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అయితే చాలా సంస్థలు ఇప్పటికీ పాత టెక్నాలజీ వ్యవస్థలు, విభిన్న డేటా, సంక్లిష్ట నిబంధనలు, టెక్నాలజీ అప్పులతో పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లో AIను నేరుగా అమలు చేయడం సాధ్యం కాదని, ప్రతి సంస్థ అవసరాలకు అనుగుణంగా దానిని సమీకరించడం, నియంత్రించడం, నమ్మదగినదిగా మార్చడం ఐటీ కంపెనీల బాధ్యత అని వివరించారు.

AIని వ్యాపార భాగస్వామిగా మార్చటం..
ఏఐ యుగంలో టెక్ మహీంద్రా వంటి సంస్థలు కేవలం సాంకేతిక సేవలు అందించే కంపెనీలు కాదని, AIను సంస్థలకు ఉపయోగకరమైన, విశ్వసనీయమైన వ్యాపార భాగస్వామిగా మార్చే కీలక వేదికగా నిలుస్తాయని ఆనంద్ మహీంద్రా అన్నారు. మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ టెక్ మహీంద్రా వరుసగా 10 త్రైమాసికాలుగా లాభాల మార్జిన్‌ను పెంచుకుందని, ఒక బిలియన్ డాలర్లకు పైగా డీల్స్ సాధించిందని వెల్లడించారు.

AIలో భారత్ వినియోగదారుడే కాదు.. నాయకుడిగా ఎదగాలి
ఫ్రంటియర్ ఏఐ మోడళ్ల అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా కొత్త పోటీకి దారితీస్తోందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ అనేది కేవలం టెక్నాలజీ అంశం మాత్రమే కాకుండా నమ్మకం, నియంత్రణ, జాతీయ ప్రయోజనాలు, డిజిటల్ సార్వభౌమత్వానికి సంబంధించిన వ్యూహాత్మక సామర్థ్యంగా మారనుందని చెప్పారు. భారత్ ఇతర దేశాలు అభివృద్ధి చేసిన ఏఐని వినియోగించే దేశంగా మాత్రమే కాకుండా, స్వయంగా AI సాంకేతికతను అభివృద్ధి చేసే, రూపుదిద్దే, ప్రపంచానికి నమ్మకాన్ని అందించే దేశంగా ఎదగాల్సిన అవసరం ఉందని మహీంద్రా పిలుపునిచ్చారు.