జూన్క్వార్టర్‎లో దుమ్మురేపిన రిలయన్స్.. క్యూ1లో రూ.3.40 లక్షల కోట్ల రికార్డ్ ఆదాయం

జూన్క్వార్టర్‎లో దుమ్మురేపిన రిలయన్స్.. క్యూ1లో రూ.3.40 లక్షల కోట్ల రికార్డ్ ఆదాయం

ముంబై: ఇండియాలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌‌‌‌ఐఎల్‌‌) ఈ ఏడాది ఏప్రిల్‌‌–జూన్ క్వార్టర్ (క్యూ1)లో అదరగొట్టింది. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్‌‌ మార్కెట్ అంచనాలను అధిగమించాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. రిలయన్స్ తన ప్రధాన విభాగాలైన ఆయిల్- టు- కెమికల్స్ (ఓ2సీ), డిజిటల్ సర్వీసెస్ (జియో),  రిటైల్ రంగాలలో రెండంకెల వృద్ధిని సాధించగలిగింది. తన చరిత్రలోనే అత్యధిక క్వార్టర్లీ  నెట్ ప్రాఫిట్‌‌ని, ఇబిటా (వడ్డీలు, ట్యాక్స్‌‌ల ముందు ప్రాఫిట్‌‌) ను నమోదు చేసింది.  

క్యూ1​ ఫలితాలు..

కన్సాలిడేటెడ్ ఆదాయం: గత ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే క్యూ1లో  రిలయన్స్‌‌ ఆదాయం 25 శాతం వృద్ధి చెంది  రూ. 3.40 లక్షల కోట్లకు చేరింది.
ఇబిటా: ఆపరేటింగ్ ప్రాఫిట్ (ఇబిటా) 10.1 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.54,067 కోట్లుగా నమోదైంది.
నికర లాభం: 6.1 శాతం వృద్ధితో ఎన్నడూ లేని విధంగా రూ. 23,196 కోట్ల ఆల్-టైమ్ హైకి చేరింది. అయితే, గతేడాది క్యూ1లో ఏషియన్ పెయింట్స్‌‌లో వాటా  అమ్మడంతో  రూ. 8,924 కోట్ల వన్-టైమ్ లాభం వచ్చింది. దీంతో  క్యూ1 లాభం గతేడాదితో పోలిస్తే తక్కువగా కనిపిస్తోంది. 

క్యాపెక్స్,  అప్పులు: రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ క్యూ1లో  రూ.38,682 కోట్ల క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌ చేయగా, నికర అప్పులు రూ. 1.23 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. "రిలయన్స్ 2026-–27 ఆర్థిక సంవత్సరాన్ని బలంగా మొదలు పెట్టింది.  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నా, కమోడిటీ మార్కెట్లలో తీవ్రహెచ్చుతగ్గులు కనిపించినా, మా విభిన్నమైన బిజినెస్‌‌లు స్థిరంగా ఉన్నాయి" అని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ  అన్నారు. 

కొనసాగిన జియో జోరు  

జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌   ఆదాయం క్యూ1లో 12శాతం వృద్ధి చెంది రూ.39,173 కోట్లకు చేరగా,   నికర లాభం  9.2 శాతం వృద్ధితో రూ. 7,764 కోట్లను టచ్ చేసింది.  జియో నెట్‌‌వర్క్‌‌ మొత్తం కస్టమర్లు 53.3 కోట్లకు పెరిగారు.  ఇందులో 28.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉండడం విశేషం.  యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) రూ. 215.6 కి పెరిగింది. జియో ప్లాట్‌‌ఫార్మ్స్ ఐపీఓ కోసం సెబీకి డీఆర్‌‌‌‌హెచ్‌‌పీ పేపర్లను ఇప్పటికే ఫైల్ చేసింది. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ రికార్డు వ్యూయర్‌‌షిప్‌‌తో జియోహాట్‌‌స్టార్ నెలవారీ యాక్టివ్ యూజర్లు  53 కోట్లకు చేరారు. దీని ఇబిటా రూ. 1,049 కోట్లుగా నమోదైంది. 

డిజిటల్ కామర్స్ వైపు రిలయన్స్ రిటైల్

రిలయన్స్ రిటైల్  గ్రాస్ రెవెన్యూ క్యూ1లో 11.6శాతం  పెరిగి రూ. 90,408 కోట్లుగా,  ఇబిటా రూ. 6,309 కోట్లుగా నమోదైంది. రూ.2,808 కోట్ల  నికర లాభాన్ని సాధించింది.  కంపెనీ డిజిటల్ కామర్స్‌‌పై ఫోకస్  పెంచింది. జియోమార్ట్ సేవలు 1,200 నగరాల్లోని 5,500 పిన్ కోడ్‌‌లకు విస్తరించింది.  మరోవైపు ఫిజికల్ స్టోర్లను కూడా పెంచుతోంది.  క్యూ1లో  కొత్తగా 252 స్టోర్లను జోడించడంతో  మొత్తం స్టోర్ల సంఖ్య 20,169 కి చేరింది. రిజిస్టర్డ్ కస్టమర్లు 39.6 కోట్లకు పెరగగా, కస్టమర్ ట్రాన్సాక్షన్లు 46శాతం పెరిగి 56.8 కోట్లకు చేరాయి.

ఆయిల్-2-కెమికల్స్,  గ్యాస్ బిజినెస్‌‌..

పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ మార్జిన్లు భారీగా పెరగడంతో రిలయన్స్ ఓ2సీ  విభాగం ఇబిటా 17.2శాతం పెరిగి నాలుగేళ్ల గరిష్టమైన రూ. 17,010 కోట్లను టచ్ చేసింది. కేజీ-డి6 లో కండెన్సేట్ ప్రొడక్షన్ పెరగడంతో  ఆయిల్ అండ్‌‌ గ్యాస్ బిజినెస్ నుంచి  రూ.4,973 కోట్ల ఇబిటా వచ్చింది.

రిలయన్స్‌‌లో పెరిగిన ప్రమోటర్ల వాటా

రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌లో ప్రమోటర్‌‌‌‌ గ్రూప్‌‌ వాటా దాదాపు 0.5 శాతం పెరిగింది. అంబానీ కుటుంబానికి చెందిన ప్రధాన ప్రమోటర్ సంస్థలైన శ్రీచక్ర కమర్షియల్స్ ఎల్‌‌ఎల్‌‌పీ, దేవర్షి కమర్షియల్స్ ఎల్‌‌ఎల్‌‌పీ, కరుణ కమర్షియల్స్ ఎల్‌‌ఎల్‌‌పీ, తత్త్వమ్ ఎంటర్‌‌ప్రైజెస్  వంటి హోల్డింగ్ సంస్థల ద్వారా మార్కెట్లో  రూ. 8,500- -–9,000 కోట్ల విలువైన షేర్ల కొనుగోళ్లు జరిగాయి. దీంతో ప్రమోటర్ గ్రూప్ వాటా  50.48 శాతానికి చేరింది.  అంబానీ, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా 0.12 శాతం వాటా (1.61 కోట్ల షేర్లు) కలిగి ఉన్నారు.  కంపెనీ షేర్లు శుక్రవారం 2.36 శాతం పెరిగి  రూ.1,327 వద్ద ముగిశాయి.