మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: నెల రోజుల మగ బిడ్డను తల్లిదండ్రులే రూ.లక్షకు అమ్మిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. రూరల్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ రూరల్ మండలం తెలుగుగూడెం గ్రామానికి చెందిన కేశవులు, నీలమ్మకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత నెల 16న మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగవ సంతానంగా మగ శిశువు జన్మించాడు.
వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో భూత్పూర్ మండలానికి చెందిన భీమయ్య రూ.లక్ష ఇచ్చి శిశువును తీసుకున్నాడు. ఆ శిశువుని హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన తరుణ్ అనే వ్యక్తికి అమ్మగా, గ్రామ సర్పంచ్ ఉషనయ్య ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించాడు. గురువారం బాబుని స్వాధీనం చేసుకొని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ జగదీశ్వరి ఫిర్యాదు మేరకు తరుణ్, భీమయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
