భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల పోరు మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో ఫారెస్ట్ అధికారులు, గిరిజన మహిళల మధ్య గొడవ.. పరస్పర దాడుల వరకు వెళ్లింది. మనుబోతులగూడెం పూర్తిగా మారుమూల గిరిజన గ్రామం. సుమారు 30 సంవత్సరాలుగా ఇక్కడి వలస గిరిజనులు పోడు భూములను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ గ్రామానికి వెళ్ళటానికి సరైన రహదారులు లేకపోవడం, కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండకపోవడంతో.. అక్కడ జరిగిన ఉద్రిక్తత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ గ్రామం అశ్వాపురం మండలంలో ఉన్నప్పటికీ.. ఫారెస్ట్ బీట్ మాత్రం మణుగూరు రేంజ్ పరిధిలోకి వస్తుంది. మణుగూరు ఫారెస్ట్ రేంజర్ ఉపేందర్ నేతృత్వంలో సుమారు నలభై మంది సిబ్బంది ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులతో మొదట వాగ్వాదానికి దిగిన అధికారులు.. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కనీసం మహిళలు అని కూడా చూడకుండా విసిరిపారేయడంతో.. ఈ ఘర్షణలో ముగ్గురు గిరిజన మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
మరోవైపు.. ఈ ఘటనపై స్పందించిన ఫారెస్ట్ శాఖాధికారులు పోడు వ్యవసాయం పేరుతో అడవులను నరుక్కుంటూ పోతే.. భవిష్యత్తు తరాలకు అడవులే మిగలవని వారు స్పష్టం చేస్తున్నారు. పర్యావరణ వినాశనం జరిగి, ఆక్సిజన్ కొరత ఏర్పడితే.. రేపటి రోజున మానవ మనుగడే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని, అందుకే అడవుల రక్షణ కోసం తాము చర్యలు చేపట్టాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.
