ప్రతి విద్యార్థిలోనూ బాగా చదువుకోవాలనే తపన, కసి ఉండాలని మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా చేగుంటలోని ప్రభుత్వ పాఠశాలలో సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ప్రభుత్వ స్కూల్‌లో చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కల్పిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని.. చేగుంట ప్రభుత్వ స్కూల్ నుండి ఇద్దరు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ (IIIT) లో సీటు రావడం ఇందుకు నిదర్శనమని ఆయన అభినందించారు. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే బలమైన లక్ష్యం ప్రతీ తల్లిదండ్రికీ ఉంటుందని, దానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల్లో బడ్జెట్‌ను మరింత పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇక ప్రస్తుత సాంకేతిక ప్రపంచం , ఉద్యోగ అవకాశాలపై మంత్రి వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత పెరిగిన తర్వాత ఉద్యోగ అవకాశాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ATC) ద్వారా యువతకు శిక్షణ ఇప్పించి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరిశ్రమల ప్రాధాన్యతను వివరిస్తూ.. తమ సొంత సంస్థల్లోనే ప్రస్తుతం 5 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి వివేక్ గుర్తుచేశారు.
