హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ విధిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాకి వర్క్ చేసిన మిగతా 23 క్రాఫ్ట్‌లు ఆ సినిమాకి పని చేయవని తేల్చిచెప్పింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఇదే విషయాన్ని నిర్మాతలకు తెలియజేయనుంది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు.. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగిందంటే..?
టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి కొన్ని రోజులుగా ఈ వివాదం నలుగుతోంది. రోజురోజుకు వారి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఒక వర్గం ఉప ఎన్నికలకు పట్టుబడుతుంటే .. మరో వర్గం పూర్తిస్థాయిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి జానీ మాస్టర్ భార్య సుమతల అధ్యక్షురాలిగా ఉన్నారు. మొత్తం 16 మంది ఈసీ మెంబర్స్‌తో అసోసియేషన్ కొనసాగుతోంది. అయితే, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ని సుమలత సస్పెండ్ చేశారు. దీంతో సుమలత తీరు నచ్చక మరో 8 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఖాళీ ఏర్పడ్డ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షురాలు సుమలత నిర్ణయించారు.
అయితే మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని రాజీనామాలు చేసిన సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై జులై 12న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై వివరణ కోరేందుకు జులై 14న జానీ మాస్టర్‌ను ఫిలిం ఫెడరేషన్ పిలిచింది.
కానీ జానీ మాస్టర్ మాస్టర్ విచారణకు హాజరు కాలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెడరేషన్ జులై 17న జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇచ్చిన గడువు లోగా వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదని హెచ్చరించింది. భార్య పదవిని అడ్డం పెట్టుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న జానీ మాస్టర్ వైఖరిపై ఫెడరేషన్ పెద్దలు మండిపడుతున్నారు.
