- ఇద్దరు చిన్నారులను సంపులో వేసి, తానూ దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- కొడుకు, బిడ్డను బావిలో తోసి, తానూ దూకి చనిపోయిన మరో తల్లి
- బావిలో చెట్టు కొమ్మ పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డ బాలుడు
- నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో విషాద ఘటనలు
కల్వకుర్తి/చేవెళ్ల, వెలుగు: కుటుంబంలో గొడవల కారణంగా ఐదుగురి ప్రాణాలు బలైపోయాయి. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో కలహాలు రేగడంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను సంపులో వేసి, తానూ అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఆ తల్లితో సహా ఇద్దరు పిల్లలూ చనిపోయారు. అలాగే, భర్తతో గొడవలతో కలత చెందిన మరో తల్లి తన కొడుకు, బిడ్డను బావిలో తోసేసి, తానూ దూకి చనిపోయింది. రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో బాలుడు బావిలో చెట్టు కొమ్మను పట్టుకుని, ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పోతేపల్లికి చెందిన శిరీష(24)కు, ఆమె భర్త మహేశ్‌కు మధ్య గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శిరీష తన కుమార్తె మాన్యశ్రీ (3), కుమారుడు వర్షిత్(3 నెలలు)ను ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసి తానూ అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉన్న మహేశ్ పొలం దగ్గరికి వెళ్లి పాలు పిండుకుని ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. భార్య పిల్లల కోసం ఇల్లంతా వెతికిన అతడు ఇంటి ముందున్న నీటి సంపు మూత తీసిఉండటం గమనించి దగ్గరికి వెళ్లి చూస్తే భార్య, పిల్లల మృత దేహాలు కనిపించడంతో ఏడుస్తూ గట్టిగా కేకలు వేశాడు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని మృత దేహాలను బయటికి తీశారు. మహేశ్ ఇల్లు ఊరి చివరన ఉండటం, పక్కన పెద్దగా ఇరుగు పొరుగు లేకపోవడంతో శిరీష ఇద్దరు పిల్లలతో కలిసి సంపులో దూకిన సంగతి బయటికి తెలియలేదు. భార్య, పిల్లల మృత దేహాలను చూసిన మహేశ్ అస్వస్థతకు గురి కావడంతో ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి
చికిత్స అందిస్తున్నారు.
చెట్టు కొమ్మ పట్టుకుని బతికి బయటపడిన బాలుడు..
వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెంకుర్దు గ్రామానికి చెందిన సుధాకర్(40), వసంత(35) దంపతులు12 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి వలస వచ్చారు. కూతురు నవ్య(15), కొడుకు వరుణ్(10)తో కలిసి ఇక్కడే ఉంటూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన వసంత తన కొడుకు, కూతురును తీసుకొని ఇంటి సమీపంలో ఉన్న బావి వద్దకు వెళ్లింది. ముందు పిల్లలిద్దరిని బావిలో తోసేసి, తర్వాత తానూ దూకింది. వసంత, నవ్య బావిలో మునిగి మృతి చెందగా, వరుణ్ బావిలోని చెట్టు కొమ్మను పట్టుకుని, రాత్రంతా అలాగే ఉన్నాడు. శుక్రవారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సాయంతో వరుణ్‌ను బయటికి తీశారు. తర్వాత మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
