జగిత్యాలలో 14 మంది నిరాశ్రయుల రెస్క్యూ

జగిత్యాలలో 14 మంది నిరాశ్రయుల రెస్క్యూ
  • స్నానం, హెయిర్  కటింగ్, కొత్త బట్టలు పంపిణీ
  •     ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
  •     కోర్టు ఆదేశాలతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలింపు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వీధుల్లో నిరాశ్రయులుగా జీవిస్తూ, మతిస్థిమితం కోల్పోయిన 14 మంది అనాథలకు అండగా నిలిచారు. వారికి కొత్త జీవితాన్ని అందించే దిశగా ప్రత్యేక రెస్క్యూ  ఆపరేషన్  చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాలతో పట్టణ పోలీసులు వీధుల్లో తిరుగుతున్న 14 మంది అనాథలు, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులను గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి హెయిర్  కటింగ్, స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. 

వారందరినీ కోర్టులో హాజరు పరిచి, కోర్టు ఆదేశాలతో మెరుగైన వైద్యం, మానసిక సంరక్షణ కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల టౌన్  సీఐ కరుణాకర్ తెలిపారు. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వైద్య సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేర నియంత్రణకే పరిమితం కాకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న నిరాశ్రయులకు అండగా నిలిచిన జగిత్యాల పోలీసులను స్థానికులు అభినందించారు.