క్లెయిమ్ ఎగ్గొట్టేందుకు అతితెలివి చూపించిన HDFC Life.. రూ.50 లక్షలు కట్టించిన కర్నూలు కోర్టు

క్లెయిమ్ ఎగ్గొట్టేందుకు అతితెలివి చూపించిన HDFC Life.. రూ.50 లక్షలు కట్టించిన కర్నూలు కోర్టు

లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను తిరస్కరించిన HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. డాక్టర్ మరణం తర్వాత ఆయన భార్య దాఖలు చేసిన రూ.50 లక్షల క్లెయిమ్‌ను రిజెక్ట్ చేయటాన్ని కమిషన్ తప్పుపట్టింది. పూర్తి ఇన్సూరెన్స్ మొత్తంతో పాటు మానసిక వేదనకు రూ.50 వేల పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.

అసలు వివాదం ఎలా మొదలైంది?
కర్నూలుకు చెందిన డాక్టర్ జి. శ్రావణ్ కుమార్ 2022 అక్టోబర్ 15న HDFC లైఫ్ 'క్లిక్ 2 ప్రొటెక్ట్ సూపర్' పాలసీ తీసుకున్నారు. ఇందుకు సంవత్సరానికి రూ.11వేల 478 ప్రీమియం చెల్లిస్తూ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ పొందారు. 2024 ఫిబ్రవరి 16న ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉండగా గుండెపోటుతో ఆయన మరణించారు. నామినీ అయిన భార్య బొంతల సింధుజ క్లెయిమ్ కోసం దాఖలు చేయగా.. HDFC లైఫ్ దానిని తిరస్కరించింది.

HDFC లైఫ్ వాదన ఇదే..
పాలసీ తీసుకునే సమయంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ ఇప్పటికే మరో రెండు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నప్పటికీ వాటిని వెల్లడించలేదని HDFC లైఫ్ పేర్కొంది. ఒకటి కోటక్ లైఫ్‌లో, మరొకటి భారతి AXAలో ఉండగా.. ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆరోపించింది. ఈ సమాచారాన్ని ముందుగానే తెలిసి ఉంటే పాలసీనే జారీ చేసేవాళ్లం కాదని కంపెనీ వాదించింది.

కోర్టు ఎందుకు తిరస్కరించింది?
కమిషన్ పాలసీ దరఖాస్తు ఫారమ్‌ను పరిశీలించి కీలక అంశాన్ని గుర్తించింది. అందులో ఉన్న ప్రశ్న HDFC లైఫ్‌లో ఉన్న ఇతర పాలసీల గురించేనని, ఇతర కంపెనీల పాలసీల వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టంగా ఎక్కడా అడగలేదని తెలిపింది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఫారమ్ రూపొందించిన కంపెనీకే బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది.

అలాగే బీమా చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం క్లెయిమ్‌ను తిరస్కరించాలంటే ఉద్దేశపూర్వకంగా కీలక సమాచారాన్ని దాచినట్లు కంపెనీ నిరూపించాలని పేర్కొంది. ఈ కేసులో అలాంటి ఆధారాలు HDFC లైఫ్ సమర్పించలేదని కమిషన్ తేల్చేసింది. డాక్టర్ మరణం సహజసిద్ధమైన గుండెపోటుతో జరిగిందని, ఇతర పాలసీల వివరాలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని కోర్టు మెుట్టికాయలు వేసింది.

45 రోజుల్లో చెల్లించాలి.. లేదంటే వడ్డీ
డాక్టర్ భార్య సింధుజకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ మెుత్తాన్ని, రూ.50 వేల పరిహారం, రూ.10 వేల న్యాయ ఖర్చులను HDFC లైఫ్ 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. గడువులోపు చెల్లించకపోతే ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి చెల్లింపు పూర్తయ్యే వరకు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించే విషయంలో చట్టపరమైన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలనే సందేశాన్ని మరోసారి స్పష్టంగా తెలియజేసింది. కంపెనీ ఇతర పాలసీల గురించి అడగకుండా క్లెయిమ్ చెల్లించేసమయంలో ఆ వివరాలు తెలియవు కాబట్టి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తాం అంటే కుదరదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.