భారత్కి బిగ్ షాక్: 3వ వన్డేకు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

భారత్కి బిగ్ షాక్: 3వ వన్డేకు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

IND vs ENG: ఇంగ్లాండ్‌తో ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ప్రస్తుతం 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1–1 తేడాతో సమంగా ఉన్న తరుణంలో, విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇండియాకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.

కార్డిఫ్ వన్డేలో గాయం.. కోచ్ సితాంశు కోటక్: 
గురువారం కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా వాషింగ్టన్ సుందర్ కాలికి తీవ్ర గాయమైంది. ఆ మ్యాచ్‌లో అతను 5 బంతుల్లో 2 రన్స్ మాత్రమే చేసి తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఇన్నింగ్స్ విరామ సమయంలో ఫిజియో అతని తొడకు బ్యాండేజ్ కడుతూ కనిపించారు. ఈ గాయం కారణంగా అతను ఆ తర్వాత భారత్ బౌలింగ్ సమయంలో ఫీల్డింగ్ కూడా చేయలేకపోయాడు. సుందర్ గాయంపై ఇండియన్ బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ తన మొదటి రన్ కోసం మిడ్-ఆఫ్ వైపు పరుగెడుతున్నప్పుడు గాయపడ్డాడు. అతని కండరాల గాయం (Muscle Injury) చాలా తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ తీవ్ర అసౌకర్యం వల్లే అతను ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు. 

ఆల్‌రౌండర్ల కొరత.. రేసులోకి కుల్దీప్ యాదవ్: 
ఒకప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ప్రత్యామ్నాయంగా చూసిన వాషింగ్టన్ సుందర్, ఇప్పుడు 3 ఫార్మాట్లలోనూ భారత్‌కు అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు. తొలి వన్డేలో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టును గెలిపించిన సుందర్ స్థానాన్ని భర్తీ చేయడం ప్రస్తుతానికి పెద్ద సవాలే. ఎందుకంటే జట్టులోని ఇతర ప్రధాన ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో లార్డ్స్ వన్డేలో వాషీ స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్:  
వాషింగ్టన్ సుందర్ లేని లోటును భర్తీ చేస్తూ బౌలింగ్ విభాగాన్ని ఎలా సమతుల్యం చేస్తారనే దానిపైనే లార్డ్స్‌లో టీమిండియా వ్యూహం ఆధారపడి ఉంటుంది. అనారోగ్యంతో రెండో వన్డేకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ గనుక కోలుకుంటే.. జట్టు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఇద్దరినీ కలిపి ఆడించే ఛాన్స్ ఉంది. ఒకవేళ రాహుల్ అందుబాటులోకి రాకపోతే కుల్దీప్ యాదవ్ ఒక్కడే స్పిన్ విభాగంలో ఏకైక మార్గం. కానీ, ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన కనబరిచిన తర్వాత కుల్దీప్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఛాన్స్ లు తగ్గిపోయాయి. భారత్ ఆడిన గత 13 మ్యాచ్‌లలో అతను కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆడటం గమనార్హం.