లార్డ్స్ వన్డేనే లాస్ట్ కాదు.. రోహిత్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ చీఫ్ ఏమన్నాడంటే?

లార్డ్స్ వన్డేనే లాస్ట్ కాదు.. రోహిత్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ చీఫ్ ఏమన్నాడంటే?

Rohit Sharma Retirement: ఇంగ్లాండ్‌తో ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌తో రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు తెరపడనుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బ్రేక్ వేసింది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేడని, సెలెక్టర్లు అతనిని పక్కన పెట్టాలని చూస్తున్నారంటూ వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా ఖండించారు. లార్డ్స్ వన్డే రోహిత్‌కు ఆఖరి మ్యాచ్ కాదని, అతను ఇప్పటికీ భారత జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడని స్పష్టం చేశారు.

రూమర్లను కొట్టిపారేసిన బీసీసీఐ సెక్రటరీ: 
రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు, సెలెక్టర్ల అల్టిమేటంపై వస్తున్న నివేదికలను దేవజిత్ సైకియా పూర్తిగా అబద్ధాలుగా కొట్టిపారేశారు. రోహిత్ భారత్‌కు ఎప్పుడూ కీలక ఆటగాడే. లార్డ్స్ మ్యాచ్ అతని ఆఖరి వన్డే అనే చర్చ బీసీసీఐలో అసలు జరగనే లేదు.. ప్రస్తుతం జట్టు మొత్తం ఇంగ్లాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌పైనే దృష్టి పెట్టింది. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ ఆశించిన స్థాయిలో రన్స్ చేయనప్పటికీ, అతని స్థానానికి ఎలాంటి ఢోకా లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

హిట్‌మ్యాన్ అద్భుతమైన వన్డే ప్రస్థానం: 
రోహిత్ శర్మ ఇప్పటికే 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్‌కు, ఆపై మే 2025లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత వన్డే జట్టు పగ్గాలను శుభ్‌మన్ గిల్ అందుకున్నప్పటికీ, రోహిత్ ఓపెనర్‌గా జట్టులో కొనసాగుతున్నారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, నమ్మకమైన ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ కు తిరుగులేని రికార్డు ఉందని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా చెప్పుకొచ్చారు.

రోహిత్ శర్మ వన్డే కెరీర్ రికార్డులు:
* మొత్తం 286 వన్డేలు మ్యాచ్‌లు
* 11,731 పరుగులు 
* 56 వన్డేలలో భారత్ ని కెప్టెన్ గా ముందుండి నడిపించిన రోహిత్

హిట్‌మ్యాన్ ఫామ్‌పై విమర్శలు: 
రోహిత్ అటాకింగ్ కెప్టెన్సీలోనే భారత్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా, యూఏఈలో జరిగిన 2025 ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) టైటిల్‌ను భారత్ గెలవడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఏకైక ఫార్మాట్ వన్డే మాత్రమే.. కేవలం రెండు మ్యాచ్‌ల ఫామ్ ఆధారంగా అతని కెరీర్ ముగిసిపోయిందని అనడం సరికాదని, లార్డ్స్ వేదికగా ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకొని విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.