లండన్: ఇంగ్లండ్ మెన్స్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ రేసు నుంచి జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్ తప్పుకున్నాడు. ఈ పదవి కంటే ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్లకు కోచ్‌గా కొనసాగడానికే మొగ్గు చూపాడు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ అంశంపై ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో ఇటీవల ఫ్లవర్ చర్చలు జరిపాడు. కానీ రాబ్ కీ ఇచ్చిన ఆఫర్‌ను అతను సున్నితంగా తిరస్కరించాడు. గతంలో 2009 నుంచి 2014 వరకు ఇంగ్లండ్ జట్టుకు విజయవంతమైన కోచ్‌గా సేవలందించిన ఫ్లవర్‌ను.. మరోసారి మెకల్లమ్ ప్లేస్‌లో భర్తీ చేయాలని ఈసీబీ భావించింది.
