ఢిల్లీ జంతర్ మంతర్‌లో మరో హై టెన్షన్. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ.. 20 మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ.. 20 రోజులుగా ఆమరణ దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ దీక్షను.. అర్థరాత్రి బలవంతంగా భగ్నం చేశారు. అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలోనే కాక్రోచ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నది. సోనమ్ వాంగ్ చుక్ స్థానంలో.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఆమరణ దీక్ష చేపట్టారు. సోనమ్ ఏ డిమాండ్లతో అయితే ఆమరణ దీక్ష చేపట్టారో.. అవే డిమాండ్లతో తాను దీక్ష చేపట్టినట్లు దీప్కే స్పష్టం చేశారు. దీంతో జంతర్ మంతర్ దగ్గర మరోసారి హై టెన్షన్ నెలకొంది.
ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేసినా మా ఉద్యమం ఆగదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. సోనమ్ స్థానంలో తాను నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ప్రకటించారు.
మేం ఇక్కడే ఉంటాం.. ఇక్కడే మా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముందుగా చెప్పినట్లే జులై 20న తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం చేసి తీరుతామని కుండబద్దలు కొట్టారు. ఎవరూ వెనక్కి తగ్గొద్దని.. పెద్ద ఎత్తున జంతర్ మంతర్‌కు తరలిరావాలని మద్దతుదారులకు సూచించారు.
సోనమ్ వాంగ్ చుక్‌ను దీక్షా శిబరం నుంచి పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీజేపీ మద్దతుదారులపై పోలీసులు విచక్షణరహితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. శాంతియుతంగా చేస్తోన్న తమ దీక్షను భగ్నం చేసి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని హెచ్చరించారు. మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకు రెట్టింపు వేగంతో మా ఉద్యమం మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు.
కాగా, నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ పర్యావరణ వేత, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
శనివారానికి (జులై 118) ఆయన దీక్ష 21వ రోజుకు చేరుకుంది. 21 రోజులుగా తిండి, నీరు లేకపోవడంతో సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆయన దీక్ష ఇలాగే కొనసాగిస్తే చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.
