కరీంనగర్, వెలుగు: మట్టి దుబ్బ లోడుతో వెళ్తున్న 4 లారీలను పట్టుకుని మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు ఓ పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ ఇస్తే.. వాటికి ఇసుక అక్రమ మైనింగ్ పేరిట పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ అధికారులు ఫైన్ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామంలో క్వారీ నుంచి మట్టి దుబ్బను తవ్వేందుకు భూమి యజమాని ఆరకొండ సుగుణ ఆ జిల్లా మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుంచి అనుమతులు తీసుకోగా.. హర్షిత్‌రెడ్డి అనే వ్యక్తి లీజుపై నడిపిస్తున్నారు.
ఈ క్వారీ నుంచి మట్టిదుబ్బ(సాండ్ డస్ట్) లోడుతో జగిత్యాలలోని ఎంజేసీ బ్రిక్స్‌ఇండస్ట్రీకి వే బిల్లులతో బయల్దేరిన 4 టిప్పర్లను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామం మీదుగా పొత్కపల్లి ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి జూన్30న పట్టుకున్నారు. తాను అక్రమంగా సాండ్ డస్ట్ తో వెళ్తున్న 4 లారీలను పట్టుకున్నానని, తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పెద్దపల్లి జిల్లా మైనింగ్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కు లేఖ చేశారు.
మట్టి దుబ్బను ఇసుకగా మార్చేసిన అధికారులు..
తమకు ఉన్న అనుమతులు, వే బిల్లులు చూపినా అధికారులు పట్టించుకోలేదు. పైగా పెద్దపల్లి కలెక్టరేట్ అధికారులు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటూ లారీకి రూ.50 వేల చొప్పున 4 లారీలకు కలిపి రూ.2 లక్షల ఫైన్ వేశారు. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సాండ్ మేనేజ్ మెంట్ సొసైటీ పేరిట డీడీ తీసి ఇచ్చాక వాహనాలను విడుదల చేశారు. పోత్కపల్లి ఎస్సై తన లేఖలో సాండ్ డస్ట్ అని పేర్కొన్నప్పటికీ.. కలెక్టరేట్ అధికారులు ఇసుక అక్రమ మైనింగ్, రవాణా అని ఎలా మార్చారని సదరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
