డ్రగ్స్ గా పెయిన్‌‌ కిల్లర్ ట్యాబ్లెట్లు ..సిరంజిలతో వినియోగం..ఫార్మసిస్ట్‌‌ సహా ముగ్గురు అరెస్ట్‌‌

 డ్రగ్స్ గా పెయిన్‌‌ కిల్లర్ ట్యాబ్లెట్లు ..సిరంజిలతో  వినియోగం..ఫార్మసిస్ట్‌‌ సహా ముగ్గురు అరెస్ట్‌‌

గుడిహత్నూర్, వెలుగు: నొప్పి నివారణకు ఉపయోగించే టాపెంటాడాల్ పెయిన్‌‌కిల్లర్ ట్యాబ్లెట్లను సిరంజిల ద్వారా మత్తు కోసం వినియోగిస్తున్న ముఠాను ఉట్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం ఉట్నూర్​ పట్టణంలోని ఈద్గా కేబీ కాంప్లెక్స్ సమీపంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు యువకులను విచారించగా, వారు టాపెంటాడాల్ ట్యాబ్లెట్లను సిరంజీల ద్వారా మత్తు కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 

దర్యాప్తులో స్థానిక ఫార్మసిస్ట్ కదం శేఖర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ ట్యాబ్లెట్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో ఫార్మసిస్ట్ శేఖర్‌‌తో పాటు ట్యాబ్లెట్లు కొనుగోలు చేసి వినియోగిస్తున్న చౌహాన్ నిఖిల్‌‌రాజ్, పొడేటి వంశీకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి మూడు స్ట్రిప్‌‌ల టాపెంటాడాల్ ట్యాబ్లెట్లు, రెండు సిరంజిలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరిచామని, పరారీలో ఉన్న మరో 
ఇద్దరి కోసం సీఐ ఎం. ప్రసాద్, ఎస్‌‌ఐ విజయ్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏఎస్పీ తెలిపారు.