న్యూఢిల్లీ: నా అనుమతి లేకుండా నా భర్తకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయొద్దని ప్రముఖ పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ సతీమణి గీతాంజలి అన్నారు. నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహర దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శనివారానికి (జులై 18) ఆయన చేపట్టిన దీక్ష 21వ రోజుకు చేరడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనను ఆకస్మాత్తుగా ఆసుపత్రికి తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను సప్దర్ జంగ్ ఆసుపత్రిలోనే ఉన్నానని తెలిపారు. నా అనుమతి, గత 20 రోజులుగా అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల పర్మిషన్ తీసుకోకుండా నా భర్తకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయొద్దని ఆమె పేర్కొన్నారు. ఆర్టికల్ 32 ప్రకారం ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కని ఆమె అన్నారు. మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిపుణుల వైద్య సలహా మేరకు వాంగ్‌చుక్‌ను అత్యవసర వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
21 రోజులకు చేరిన వాంగ్ చుక్ దీక్ష
నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ పర్యావరణ వేత, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
శనివారానికి (జులై 118) ఆయన దీక్ష 21వ రోజుకు చేరుకుంది. 21 రోజులుగా తిండి, నీరు లేకపోవడంతో సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆయన దీక్ష ఇలాగే కొనసాగిస్తే చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.
