భారత ప్రభుత్వం వల్లే బుల్లెట్ ట్రైన్ ఆలస్యం.. మోడీ సర్కార్ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలే: జపాన్ మాజీ మంత్రి మకిహారా

భారత ప్రభుత్వం వల్లే బుల్లెట్ ట్రైన్ ఆలస్యం.. మోడీ సర్కార్ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలే: జపాన్ మాజీ మంత్రి మకిహారా

న్యూఢిల్లీ: భారత్–జపాన్ దేశాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యంపై జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడెకి మకిహారా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు అలస్యానికి 100% భారత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రాజెక్టులో జరుగుతున్న జాప్యంపై బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ముంబై-–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జపాన్ ఎంతో కష్టపడింది. కేవలం భారత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. 

ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన చర్చల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ భారత్ నిలబెట్టుకోలేదు.పైగా చర్చల్లో ఒక మాట చెప్పి ఆ మాటను వెంటనే మార్చేసేవారు. రైల్వే భద్రతకు ముఖ్యమైన సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దూరం పెట్టారు. ప్రాజెక్టుకు ఉన్న ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. భారత ప్రభుత్వ తీరు వల్లే ముంబై–--అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇంతగా జాప్యానికి గురైంది’ అని అసహనం వ్యక్తం చేశారు. 

కాగా, హిడెకి విమర్శల నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా మండిపడ్డారు. ‘బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆలస్యం కావడం అనేది మోదీ ప్రభుత్వం, ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న మంత్రి అసమర్థతకు నిదర్శనం. కీలక ప్రాజెక్టులను కూడా స్వప్రయోజనాల కోసం వాడుకోవడం దేశానికే సిగ్గుచేటు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు, హిడేకి చేసిన విమర్శలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని కొట్టిపారేశారు.